కర్ణాటక ఎన్నికలపై విజయసాయిరెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటక అసెంబ్లీ (మొత్తం 224 సీట్లు) 16వ ఎన్నికల పోలింగ్ ఈ నెల 10న జరుగుతున్న నేపథ్యంలో ఈ దక్షిణాది రాజ్యంపై నేడు అందరి దృష్టి పడింది. ఐటీ రంగంలో భారత సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరు ఇంజన్ మాదిరి పనిచేస్తూ.. టెక్నాలజీ కేంద్రంగా కర్ణాటకను ముందుకు తీసుకుపోతోంది. దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ తర్వాత నాలుగో అత్యంత ధనిక భారత రాష్ట్రంగా కర్ణాటక అవతరించిందని వివరించారు.
247.38 బిలియన్ డాలర్ల స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తితో (జీఎస్టీడీపీ) కర్ణాటక పరుగులు పెడుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే పొడవైన సముద్రతీరం, అరేబియా సముద్రం తీరం వెంబడి ఆధునిక రేవు పట్టణాలు, నగరాలు అభివృద్ధిచెందడం కూడా ఈ మూడో అతిపెద్ద దక్షిణాది రాష్ట్రం (ఏపీ విభజనతో ఈ స్థానం దక్కింది) ప్రగతికి కారణంగా చెప్పుకోవచ్చు. ఏపీలోని నెల్లూరు, ప్రకాశం, ఇంకా రాయలసీమ జిల్లాలవాసులకు తమిళనాడు రాజధాని చెన్నై మాదిరిగానే బెంగళూరు, ఇతర కర్ణాటక పట్టణాలు, నగరాలు వలస వచ్చి స్థిరపడడానికి అనువైన ప్రాంతాలుగా మారాయన్నారు.
2004 ఎన్నికల తర్వాత ఏర్పడిన కర్ణాటక 12వ శాసనసభ రాజకీయ అస్థిరత వల్ల నాలుగేళ్లకే రద్దవడంతో ఈ రెండు దక్షిణాది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఏడాది కాలం వ్యత్యాసంతో జరగడం ఆనవాయితీగా మారింది. అలాగే కిందటిసారి తెలంగాణ అసెంబ్లీకి ఆరు నెలలు ముందుగానే 2018 డిసెంబర్ లో ఎన్నికలు జరిపించడంతో ఇప్పుడు మొదట వేసవిలో (మే నెలలో) కర్ణాటకలో, శీతాకాలంలో (డిసెంబర్) తెలంగాణలో, వచ్చే ఏడాది ఏప్రిల్–మేలో ఆంధ్రాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గత 30 ఏళ్లలో సంభవించిన రాజకీయ పరిణామాల వల్ల ఇలా మూడు దక్షిణాది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దాదాపు ఆరు నెలల తేడాతో వరుసగా మూడు వేర్వేరు సందర్భాల్లో జరిగే పరిస్థితి వచ్చింది. తమిళనాడులో మాదిరిగానే లక్షలాది మంది తెలుగువారు అన్ని రంగాల్లో, ప్రాంతాల్లో స్థిరపడిన రాష్ట్ర్రం కావడంతో కర్ణాటక రాజకీయాలపై తెలుగునాట ఎనలేని ఆసక్తి వ్యక్తమౌతోంది. మిగిలిన నాలుగు దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే ఉత్తరాది రాజకీయాల ప్రభావం విస్తరించిన కర్ణాటక ప్రజల తీర్పు ఎలా ఉంటుందా అని ఓట్లు లెక్కించే మే 13 కోసం తెలుగు ప్రజానీకం ఎదురుచూస్తున్నారు. 2004 ఎన్నికల నుంచీ కర్ణాటకలో ఏ పార్టీకీ సాధారణ మెజారిటీ రాకుండా హంగ్ అసెంబ్లీలే ఏర్పడుతూ వస్తున్నాయి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాతైనా ఈసారి రెండు ప్రధాన జాతీయపక్షాల్లో ఏదో ఒక పార్టీకి కనీస మెజారిటీకి అవసరమైన సీట్లు వస్తాయా? రావా? అనేదే నేడు బిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిందని పోస్ట్ పెట్టారు విజయసాయిరెడ్డి.