పాకిస్తాన్ లో పరిస్థితులపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్ చేశారు. భారత్ కోరుకునేది పాకిస్తాన్ లో శాంతి, సుస్థిరత అంటూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ‘పొరుగు దేశాలు చల్లగా ఉండాలి. వాటితో మనకు సుహృద్భావ సంబంధాలు ఉండాలి,’ అనేది భారత విదేశాంగ విధానం ముఖ్యసూత్రం అని వివరించారు విజయసాయిరెడ్డి.
ఇప్పుడు పశ్చిమాన సరిహద్దు దేశం పాకిస్తాన్ రాజకీయ అశాంతి చుట్టుముట్టే పరిస్థితిని ఎదుర్కొంటోందన్నారు. పాక్ మాజీ ప్రధాని, మాజీ క్రికెట్ స్టార్ ఇమ్రాన్ ఖాన్ ను శనివారం పారామిలిటరీ రేంజర్లు దేశ రాజధాని ఇస్లామాబాద్ లోని హైకోర్టు ముందు అరెస్టు చేయడంతో సంక్షోభం తీవ్రమౌతోందని వెల్లడించారు. అసలే ఆర్థిక, సామాజిక సమస్యలు తీవ్రమైన సమయంలో మాజీ ప్రధాని, మంచి జనాకర్షణ శక్తి ఉన్న ఇమ్రాన్ అరెస్టు పాకిస్తాన్ ను ‘అగ్నిగుండం’లోకి నెట్టివేసే ప్రమాదం ఉందని భారత రక్షణ, రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పోస్ట్ పెట్టారు విజయసాయిరెడ్డి.