స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా ఓడీఎఫ్ ప్లస్ కేటగిరీలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు గ్రామీణ స్వచ్ఛభారత్ మిషన్ రెండో దశ ఫలితాలను కేంద్ర జల్‌శక్తి శాఖ వెల్లడించింది. స్వచ్ఛభారత్ మిషన్‌లో భారత్ మరో మైలురాయిని దాటినట్లు పేర్కొంది. మిషన్ రెండో దశలో దాదాపు 50% గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్ స్థాయికి చేరాయని.. ఇందులో 100% ఫలితాలు సాధించి తెలంగాణ టాప్‌లో నిలిచినట్లు తెలిపింది.
బహిరంగ మల విసర్జన నుంచి విముక్తి పొందిన ఈ గ్రామాల్లో ఘన లేదా ద్రవ వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ అమల్లో ఉంటే వాటిని ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలుగా పిలుస్తారన్న విషయం తెలిసిందే. మే 10వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా 2,96,928 గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్‌లో ఉన్నట్లు కేంద్ర జల్‌శక్తి శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో అన్ని గ్రామ పంచాయతీలు ఓడీఎఫ్ ప్లస్‌గా కలిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ (100%) తొలిస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో కర్ణాటక (99.5%), తమిళనాడు (97.8%), ఉత్తర్‌ప్రదేశ్ (95.2%)లు ఉండగా చివరి స్థానంలో గుజరాత్ ఉంది.