ఏంటమ్మా రాములమ్మ …! ఈ కన్ఫ్యూజన్ ?

విజయశాంతి… అలియాస్ రాములమ్మ కాంగ్రెస్ పార్టీలో ప్రచార కమిటీ చైర్మన్ అనే పెద్ద పదవిని నిర్వహిస్తున్నారు. తెలంగాణ నాయకులతో ఆమెకు రాజకీయ సఖ్యత ఉందో లేదో తెలియదు కానీ, కాంగ్రెస్ అధిష్టానం పెద్దల వద్ద మాత్రం మంచి పలుకుబడి ఉంది. కాకపోతే ఆమెను తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు ఎవరు పెద్దగా పట్టించుకోనట్టు గా వ్యవహరించడం, కొన్ని కీలక సమావేశాలకు పిలవకపోవడం తోనే ఆమె అలుగుతూ వస్తున్నారు. ఈ మధ్య జరిగిన ఎన్నికల  ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఈ సంగతి పక్కన పెడితే, ఆమె గత కొంత కాలంగా పార్టీ మారుతున్నారు అంటూ అదేపనిగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి బిజెపి లోకి వెళ్లాలి అనుకుంటున్నారు అని , కాంగ్రెస్ లో ఉంటే రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని భావించే,  తన దారి తాను చూసుకున్నారని పెద్దఎత్తున ప్రచారం జరిగింది.
ఈ ప్రచారాన్ని నేరుగా ఆమె ఎక్కడ ఖండించలేదు. కాకపోతే పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి,  తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాకూర్, మధుయాష్కిగౌడ్ వంటి వారు మాత్రమే స్పందించి ఆమె పార్టీ మారడం లేదని, కాంగ్రెస్ లోనే కొనసాగుతారని , అవన్నీ అసత్య కథనాలు అంటూ ఖండించారు. మధుయాష్కీ గౌడ్ చేసిన వ్యాఖ్యల పైన విజయశాంతి సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. ఆయనకు నా ధన్యవాదాలు అంటూ చెబుతూనే కాంగ్రెస్ లోని కొంతమంది సీనియర్ తాను పార్టీ మారుతున్నట్లు మీడియాకు లీకులు ఇస్తున్నారంటూ పోస్ట్ పెట్టారు. కానీ అందులోనూ తాను కాంగ్రెస్ లోనే ఉంటానని, బీజేపీ లోకి వెళ్లడం లేదని డైరెక్ట్ గా మాత్రం చెప్పలేదు.  దీంతో ఆమె పార్టీ మార్పుపై ఇంకా అనుమానాలు అలాగే ఉన్నాయి.
తాజాగా విజయశాంతి ఈనెల 24వ తారీఖున బిజెపిలో చేరబోతున్నారని , ఈ మేరకు బీజేపీ అగ్రనేతలతో చర్చలు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో ఆమె బీజేపీ కండువా కప్పు కునేందుకు సిద్ధమయ్యారు అంటూ, మరో ప్రచారం తాజాగా తెరమీదకు రావడంతో,  గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ లో ఉంటారో లేక బిజెపిలోకి వెళ్తారో అనేది ఎవరికీ అంతుపట్టడం లేదు . నేరుగా ఆమె ఈ వ్యవహారంపై స్పందించి క్లారిటీ ఇస్తే ఎటువంటి గాసిప్స్ ఉండేవి కాదు. కానీ ఆమె ఆ విధంగా చేయడం లేదు. తాజాగా 24 వ తారీఖున ఆమె చేరబోతున్నట్లు ఓ ప్రధాన మీడియాలో వార్తలు వస్తుండడంతో ఎక్కడలేని గందరగోళం నెలకొంది.
-Surya