ఆంధ్రప్రదేశ్ లో మే 13న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 7 దశల్లో మొత్తం ఎన్నికలు జరిగిన తరువాత జూన్ 04న ఫలితాలు వెల్లడించనున్నారు. అయితే అప్పటి వరకు ఎలాంటి సర్వేలు కూడా విడుదల చేయకూడదని ఈసీ వెల్లడించింది. జూన్ 01న 7వ దశ ఎన్నికల తరువాత సర్వేలకు అనుమతిచ్చింది. జూన్ 01 సాయంత్రం 6 గంటల తరవాత విడుదల చేసుకునే అవకాశం కల్పించింది. ఈ తరుణంలోనే ఏపీలో పోస్టల్ బ్యాలెట్ పై చర్చలు జరుగుతున్నాయి.
పోస్టల్ బ్యాలెట్ లో గెజిటేడ్ సంతకం సడలింపుపై హై కోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు వైఎస్సార్ సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఎన్నికల నియమావళి అమలులో ఈసీ వ్యవహార శైలిని హైకోర్టులో తేల్చుకోనున్నారు. దేశమంతటా నిబంధనలు ఉంటే.. ఏపీలో ఈసీ ప్రత్యేక రూల్స్ చెబుతోంది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారం పై గెజిటేడ్ సంతకం లేకుంటే దానిని తిరస్కరించడం నిబంధన. కానీ ఏపీలో మాత్రం గెజిటేడ్ సంతకం లేకపోయినా అనుమతించడం పై సీఈసీకి ఫిర్యాదు చేశామని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. సీఈసీ స్పందించకపోతే హైకోర్టుకు వెళ్తామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.