వైసీపీలో ఆసక్తికర చర్చ తెరమీదికి వచ్చింది. “బాస్ అలా చేస్తారని అనుకోవడం లేదు. అలా జరిగితే.. ఆలోచించాల్సిందే!“-ఇదీ ఇప్పుడు అనూహ్యంగా జరుగుతున్న కీలక చర్చ. వాస్తవానికి రాజకీయ నేతలు గ్యాసిప్స్‌కు దూరంగా ఉంటారు. తమమీద ఏవో .. రాసుకుంటారు మీడియా వాళ్లు.. అవన్నీ నిజమా? అంటూ చలోక్తులు కూడా పేలుస్తారు. కానీ, పైకి ఎన్ని అన్నా కూడా.. నాయకులు గ్యాసిప్స్‌ను ఫాలో అవుతూనే ఉంటారు. వాటిపై చర్చలు పెడుతూనే ఉంటారు. తాజాగా ఈ రోజు ఉదయం నుంచి కొన్ని ఆన్‌లైన్ చానెళ్లు, పత్రికలు, సైట్లలో జగన్ వ్యవహార శైలిపై వార్తలు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం జగన్ కేబినెట్‌లో రెండు మంత్రి వర్గ స్థానాలు ఖాళీ అయ్యాయి.
వీటిలో ఎవరిని నియమించేదీ ఇంకా జగన్ ఇతమిత్థంగా చెప్పలేదు. తమ మంత్రి పదవులకు రాజీనామా చేసిన ఇద్దరు కూడా బీసీ వర్గాలకు చెందిన వారే కావడంతో జగన్ మళ్లీ బీసీలకే ఈ రెండు పదవులు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే, పార్టీ నేతల్లో మరో ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా.. ఈ పదవుల విషయంలో అటు నాయకులు … కీలక ప్రభుత్వ పెద్దలు మౌనంగా ఉన్నప్పటికీ.. మీడియా మాత్రం వార్తలను వైరల్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీకి జగన్ ఆఫర్ ఇస్తున్నారని, ఆమెకు సీఎంవో నుంచి పోన్ వెళ్లిందని పేర్కొంటూ.. కొందరు రాసుకొచ్చారు.
దీంతో ఈ విషయంపై అప్పుడే వైసీపీలో చర్చ ప్రారంభమైంది. విడదల రజనీ.. వైసీపీలోకి ఎలా అడుగు పెట్టారు? ఆమె పుట్టు పూ ర్వోత్తరాలు ఏంటి? ఆమెకున్న రాజకీయ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఆమెకు ఎందుకు ఇవ్వాలి? ఇస్తే ఏమవుతుంది? అసలు ఈ వార్తల్లో నిజమెంత? అనే చర్చ వైసీపీలోనే జోరుగా సాగుతుండడం గమనార్హం. వీరి ప్రస్తావన బట్టి.. విడదల రజనీ కోసం సీటు త్యాగం చేసిన మర్రి రాజశేఖర్‌కు ఇప్పటికే ఎమ్మెల్సీ పీఠం సహా.. మంత్రి పదవి ఇస్తానని జగన్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటి వరకు కూడా ఆయన ఈ విషయాన్ని పట్టించుకోలేదు. వాస్తవానికి పార్టీ కోసం ఆయన ఎంతో కృషి చేశారు. జగన్ పాదయాత్ర సమయంలోనూ కష్టపడ్డారు. జగన్ మాట కోసం సీటును త్యాగం చేశారు.
అలాంటి నేతను ఇప్పుడు పక్కన పెట్టి.. రజనీకి బెర్త్ ఇవ్వడమంటే.. జగన్ విశ్వసనీయతపైనే తీవ్ర ఎదురు దాడి జరిగే అవకాశం ఉందని అంటున్నారు సొంత పార్టీ నేతలే. పార్టీలోనూ ఆయనపై నేతలకు నమ్మకం పోయే అవకాశం ఇచ్చినట్టే అవుతుందని చెబుతున్నారు. విడదలకే కనుక మంత్రి పదవి ఇచ్చి.. మర్రిని పక్కన పెడితే.. ఇన్నాళ్లు.. జగన్ ప్రజల్లో సంపాయించుకున్న విశ్వసనీయత, మడమ తిప్పడు అనే మాటలను పూర్తిగా మడిచి.. బీరువాలో పెట్టుకోవాల్సిందేనని కొంత పరుషంగానే అంటున్నారు. ఒకవేళ మర్రికి ఇచ్చే ఉంద్దేశం లేకపోతే.. విడదల విషయాన్ని పక్కన పెట్టడం ఉత్తమమని చెబుతున్నారు.