అధికార పక్షంలో ఉన్న పార్టీ ఏదైనా.. ఒక తప్పు జరుగుతుంటే.. దానిని సరిచేసుకునేందుకు ప్రయత్నించాలి. గతంలో చంద్రబాబు ఇలాంటి ప్రయత్నాలు చేసేవారు. తన పార్టీ వారు లేదా.. తాను తీసుకున్న నిర్ణయాలు ఏవైనా.. వివాదం అయితే.. వెంటనే ఉలిక్కి పడేవారు. వాటిని సరిచేసుకునేవారు. కానీ, ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తుండ డం గమనార్హం. ఒక తప్పు జరిగిన తర్వాత.. దానిని సరిచేసుకునేందుకు ప్రయత్నించకపోగా.. మళ్లీ మళ్లీ అవే తప్పులు చేస్తుండడం గమనార్హం. రాష్ట్రంలో అమరావతి ఓ ఆరని జ్వాలగా రగులుతూనే ఉంది.
దీనిని ప్రధాన ప్తప్రతిపక్షం ఫుల్లుగా వాడుకుంది. దాదాపు 320 రోజులుగా ఉద్యమం సాగుతోంది. రైతులను అరెస్టు చేశారు. లాఠీ చార్జీలు చేశారు. కేసులు పెట్టారు. ఈ మొత్తం ఎపిసోడ్‌ను టీడీపీ భారీగా వాడేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతోందంటూ.. ప్రచారం చేసుకుంది. మరి ఇంత డ్యామేజీ జరుగుతున్నా.. వైసీపీ సర్కారు నుంచి తప్పులు సరిచేసుకు నేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏమీ కనిపించడం లేదు. పైగా.. ఎక్కడికక్కడ ఈ తప్పులు మరింత పెంచేందుకు నాయకులు రెడీగా ఉండడం గమనార్హం.
దీనికి అదికారుల అత్యుత్సాహం మరింతగా కలిసి వస్తోంది. దీంతో టీడీపీకి చేతినిండా పనిదొరుకుతోందన్న భావన కలుగుతోంది. తాజాగా అమరావతి రైతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు నరసారావుపేట జైలు నుంచి గుంటూరు జైలుకు తరలించే క్రమంలో వారి చేతులకు బేడీలు వేశారు. ఇది సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధం. దీంతో ఈ పరిణామాన్ని టీడీపీ తనకు అనుకూలంగా మార్చుకుంది. పోనీ.. దీనిని శాంతపరిచే చర్యలైనా ప్రభుత్వం చేపట్టిందా? అంటే.. ముందు పోలీసులను సస్పెండ్ చేసిన సర్కారు.. ఏమనుకుందో ఏమో.. వెంటనే వారిపై సస్పెండ్ వేటును ఎత్తేసింది.
అదే సమయంలో ఎంపీ నందిగం సురేష్, మంత్రి సుచరితలు ఇది తప్పేనని వ్యాఖ్యలు చేయగా.. మరో మంత్రి కొడాలి నాని .. బేడీలు వేస్తే.. తప్పేంటని అనడం మరింతగా మండుతున్న జ్వాలపై పెట్రోల్ పోసినట్టు అయింది. ఇలా.. అమరావతి విషయంలో ఒకదాని వెంట ఒకటి తప్పులు చేసుకుంటూ పోతే.. వైసీపీ సర్కారు 30 ఏళ్ల లక్ష్యం నెరవేరేనా? అనేది మేధావుల ప్రశ్న.