ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పేరిట విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని రఘురామకృష్ణ రాజు గారు కోరారు. మార్చిలో విద్యార్థులకు ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయని, ఫిబ్రవరిలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో వారిని బలవంతంగా పాల్గొనాలని ఒత్తిడి చేయడం సరికాదన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి తొలుత 40 కోట్ల రూపాయలు అన్నారని, ఆ తర్వాత 90 కోట్లని చెప్పి ఇప్పుడు 130 కోట్ల రూపాయలకు బడ్జెట్ పెంచారని తెలిపారు. ఎన్నికల తర్వాత ఎలాగా వచ్చేది లేదని, ఇప్పుడు అందిన కాడికి దండుకోవాలని చూస్తున్నారని అన్నారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని, వారిని ఉత్తేజపరచడానికి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
ఎన్నికలకు ముందు పబ్లిసిటీ స్టంట్ మాదిరిగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి ఒకవైపు మైదానాలు లేకపోగా, వాలీబాల్స్ కూడా లేవని, ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి అంపైర్లు దొరకడం లేదట అని, అంపైర్లుగా పదవ తరగతి పాసైన ఇళ్లల్లో కన్నాలు వేసే వాలంటీర్లు వ్యవహరించరున్నారట అని అన్నారు. క్రీడల్లో వారికి ఎటువంటి ప్రావీణ్యత లేకపోయినా వారికి అంపైరింగ్ లో శిక్షణ ఇచ్చి, వారే అన్ని క్రీడలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించే వెసులు బాటు కల్పించనున్నారట అని తెలిపారు. కబడ్డీలో న్యాయ నిర్ణీతలుగా వ్యవహరించడం సులువే కానీ క్రికెట్ వంటి క్రీడలో వాలంటీర్లు ఎలా అంపైర్లుగా వ్యవహరిస్తారు అని ప్రశ్నించారు.
అంపైరింగ్ చేయాలంటే పెద్ద పెద్ద స్క్రీన్లు అవసరమని, లక్షల స్క్రీన్ లను జగన్ మోహన్ రెడ్డి గారు ఎలా సర్దుబాటు చేస్తారని ప్రశ్నించారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి విద్యార్థులను ప్రాక్టీస్ కు పంపించకపోతే తల్లిదండ్రులకు ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలను కట్ చేస్తామని వాలంటీర్లు హెచ్చరిస్తున్నట్లు రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలకు పోటీలు నిర్వహించాలన్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కరాటేలో ప్రావీణ్యం చూపబోయి, నెత్తి కాల్చుకున్న వీడియోను ఈ సందర్భంగా ఆయన ప్రదర్శించారు.