“మా ఎల్లో మీడియా స్టయిలే వేరు.. సార్.. ఆసరా పథకం బాగుంది.. మనం ఫ్రంట్ పేజీలో పెట్టకపోయినా.. ఫర్లేదు. ఉన్నది ఉన్నట్టు రాద్దాం సార్.. అన్నారు. అంతే ఇంతెత్తున లేచారు. ఖస్సు మన్నారు. ఏం చేస్తావో తెలీదు.. ఏకెయ్ అన్నారు!!“- ఇదీ.. ఆఫ్ ది రికార్డుగా మీడియా మిత్రులతో ఎల్లో మీడియాకు చెందిన ఓ సీనియర్ జర్నలిస్టు పంచుకున్న అభిప్రాయం. నిజానికి ఏ ప్రభుత్వంపైనైనా మీడియాకు వ్యతిరేక వార్తలు రాసే రైట్ ఉంటుంది. దీనిని కాదనం. అయితే, సందర్భం లేకుండానే విమర్శలు చేస్తే.. ఎలాంటి కారణం లేకుండానే పనిగట్టుకుని వ్యతిరేక వార్తలు రాస్తే!!
దీనిని నిజానికి సదరు మీడియాలో పనిచేస్తున్న చాలా మంది పాత్రికేయులు కూడా హర్షించడం లేదు. గతంలో జగన్ అనుకూల మీడియాకు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. చంద్రబాబుపై వ్యతిరేక వార్తలు రాయాలంటూ.. ఇలానే సదరుమీడియా ప్రతినిధులపై తీవ్రమైన ఒత్తిళ్లు ఉండేవి. దీంతో ఒకానొక సందర్భంలో ప్రభుత్వం నుంచి జగన్ మీడియా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది. మా సమావేశాలకు మీరు రావొద్దు.. అంటూ.. పాత్రికేయులకు మొహం మీదే చెప్పేసేవారు. ఇప్పుడు ఇదే పరిస్థితి రివర్స్ అయింది.
జగన్ వ్యతిరేక మీడియాలో మరీ ఏకేస్తున్న ఓ మీడియా ప్రతినిధులకు ఎంట్రీ లేదన్నట్టుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. దీనిపై ఎవరు మాట్లాడినా.. మీడియా మిత్రులు కూడా గతంలో మమ్మల్ని బాబు ఇబ్బంది పెట్టలేదా ? అంటూ.. ప్రశ్నిస్తున్నారు. తాజాగా జగన్ ప్రారంభించిన ఆసరా పథకంలో లోపాలు ఉంటే.. ఖచ్చితంగా వెలుగు లోకి తీసుకురావాల్సిందే. కానీ, అలాంటివేవీ లేనప్పుడు.. కూడా ఉద్దేశ పూర్వకంగా బురదజల్లేలా వ్యవహరించడంపై ఓ మీడియా ప్రతినిధి.. సుతరామూ అంగీకరించలేదు.
కానీ, ఎల్లో మీడియా మాత్రం ఆ వార్తను మార్చి రాసింది. దీంతో సదరు ప్రతినిధి.. తాను రాసింది.. ఇదీ అంటూ..సీఎంవో వర్గాలకు వివరణ ఇచ్చుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇలాంటి పోకడలు.. మీడియా ప్రతినిధులను డిఫెన్స్‌లోకి నెడుతున్నాయనే ఆవేదన కనిపిస్తోంది. మొత్తానికి వ్యతిరేక మీడియా చేస్తున్న వింత వైఖరి.. మీడియా ప్రతినిధులను కూడా ఇబ్బందుల్లోకి నెడుతోంది.
-vuyyuru subhash