ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ రోజు మంత్రి మండలి సమావేశం జరిగింది. వెలగపూడిలోని సచివాలయం కేంద్రంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా కొత్త జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీ ఏర్పాటుపై మంత్రి మండలి ఆమోదం తెలిపడంతో రాజకీయ వర్గాల్లో కలవరం ఏర్పడింది. నిజానికి కొత్త జిల్లాల ఏర్పాటు ఆయా ప్రభుత్వాలకు కాస్త ఉపయోగపడే సన్నివేశం.. సందర్భం కూడా. ప్రజానుకూలంగా ప్రజలకు సౌకర్యవంతంగా అన్ని కార్యక్రమాలు అందుబాటులోకి తేవడం.. ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు ప్రజలకు చేరువ చేయడం సులభతరం అయ్యే సులువైన మార్గం కొత్త జిల్లాల ద్వారా లభ్యమౌతుంది.
కాగా ఈరోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీ ఏర్పాటు కానుంది. సీసీఎల్‌ఏ కమిషనర్, జీఏడీ సర్వీసుల సెక్రటరీ.. ప్లానింగ్ విభాగం సెక్రటరీ, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రతినిధి, కన్వీనర్‌గా ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. వీలైనంత త్వరలో నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి కమిటీని ఆదేశించారు. అదేవిధంగా పార్లమెంట్ నియోజకవర్గం సరిహద్దుగా కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కొత్త జిల్లాల ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం తాజా నిర్ణయంతో 13 జిల్లాలను పునర్వ్యవస్థీకరించి 25 జిల్లాలు ఏర్పాటు చేయనున్నారు. అయితే.. 26వ జిల్లా ఏర్పాటుకు సంబంధించి కూడా మంత్రి మండలి సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. కొత్తగా ఏర్పాటు కానున్న అరకు జిల్లా భౌగోళికంగా ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉందని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి తెలిపారు. 4 జిల్లాలకు అరకు జిల్లా ప్రాంతం విస్తరించి ఉందని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అరకును రెండు జిల్లాలు చేసేందుకు అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించినట్లు కూడా సమాచారం అందుతుంది. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు!