వైసీపీ ఎంపీలకు జగన్‌ దిశానిర్దేశం

కేంద్రం నుంచి రావలసిన నిధులను రాబట్టేలా, పెండింగ్‌ ప్రాజెక్టులకు అనుమతులు సాధించేలా పార్లమెంటులో గళమెత్తాలని వైసీపీ ఎంపీలకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించాలని కోరారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఆయన అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఢిల్లీ నుంచి ఎంపీలు పాల్గొన్నారు.

కొంతకాలంగా అధినేతపైనా, వైసీపీ ప్రభుత్వంపైనా అసమ్మతి స్వరం వినిపిస్తున్న ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సోమవారం ఢిల్లీలోనే ఉన్నా, ఈ భేటీకి ఆయనను ఆహ్వానించలేదని సమాచారం. పార్లమెంటు సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహరచనపై వైసీపీ ఎంపీలకు జగన్‌ దిశానిర్దేశం చేశారు. అలాగే, రాష్ట్రానికి రావలసిన జీఎస్టీ బకాయిలు, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రావలసిన నిధుల విషయమై ఎంపీలంతా పార్లమెంటులో ప్రస్తావించాలని సూచించారు.