ఏపీసీఎంగాజగన్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆయన అడుగులు, వ్యూహాలను గమనిస్తే.. భవిష్యత్తుపై గట్టి ప్రణాళికతో ఆయన ముందుకు సాగుతున్న వైనం మనకు కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా అత్యంత ప్రాధాన్య నగరాలైన విజయవాడ, తిరుపతి, విశాఖపై జగన్ కోణం వేరేగా ఉందని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా విశాఖపై జగన్ వ్యూహం మరోవిధంగా ఉందని తెలుస్తోంది. దీనిని పరిపాలనా రాజధానిని చేయాలనేది జగన్ ప్రణాళిక. ఇప్పటికే ఆయన దీనిపై జీఎన్‌రావు కమిటీని వేశారు. అదేసమయంలో అసెంబ్లీలోనూ బిల్లు పెట్టారు. సో. మొత్తంగా వచ్చే ఏడాది నిర్ణీత లక్ష్యాల్లో విశాఖ నగరాన్ని మరింత అభివృద్ధి చేయాలనేది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది.
ఏడాది పాలనలో జిల్లాకు అనేక వరాలు అందించారు. మూడు రాజధానుల నిర్ణయంలో.. విశాఖని కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించి.. అందరి దృష్టి జిల్లాపై పడేలా చేశారు. ట్రామ్ రైలు.. పోలవరం నుంచి జలాల తరలింపు.. గిరిజనుల కోసం వైద్య కళాశాల.. మత్స్యకారుల వలసల నివారణకు ఫిషింగ్ హార్బర్.. నిరుద్యోగ సమస్య రూపుమాపేందుకు నైపుణ్య విశ్వవిద్యాలయం, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.1300 కోట్లతో నగరాభివృద్ధి పనులు.. పరిశ్రమల నీటి అవసరాలు తీర్చేందుకు డీశాలినేషన్ ప్లాంట్.. ఐటీ రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కాన్సెప్ట్ సిటీ.. వంటివి ప్రకటించారు.
ఇలా.. ఒకటి కాదు.. రెండు కాదు.. అభివృద్ధి చెయ్యాలన్న తలంపు ఉంటే.. ఇలా ఉంటుందా అన్న రీతిలో జిల్లాను నభూతో నభవిష్యత్ అన్నట్లు అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. గోదావరి జలాలు విశాఖకు అందించా లని సంకల్పించారు. విశాఖ నగరానికే కాకుండా.. నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలి టీలతో పాటు పాయకరావుపేట, అనకాపల్లి రూరల్ గ్రామాలకు ఈ పైప్‌లైన్ ద్వారా తాగునీటి కష్టాలు తీరనున్నాయి. పోలవరం ప్రాజెక్టు నుంచి నరవకు రూ.3,600 కోట్ల అంచనా వ్యయంతో రోజుకు 190 ఎంజీడీల నీటి సరఫరా పైప్‌లైన్ ఏర్పాటు కానుంది.
దీనికి సంబంధించిన డీపీఆర్ తయారు చెయ్యాలని సీఎం ఆదేశించడంతో జీవీఎంసీ సన్నద్ధమవుతోంది. ఈ పైప్‌లైన్ ప్రాజెక్టు పూర్తయితే.. 24 గంటలూ నగర ప్రజలకు తాగునీరు అందనుంది. ఇలా మొత్తంగా ఓ నగరం రూపు రేఖలు త్వరలోనే మారిపోనున్నాయనే వార్త విశాఖలో ప్రజలకు ఆనందాన్ని నింపుతుండడం గమనార్హం.