జై అంటే సై: రద్దు అవ్వకపోతే పొద్దు పొడిపించేద్దాం!

శాసనమండలిపై గతంలో బాబుకున్న అభిప్రాయాన్ని అసెంబ్లీ సాక్షిగా వినిపిస్తూ, వాటికి విలువనిస్తూ… అక్కడ పెద్దలు అనబడేవారి ప్రవర్తన సరిగాలేదని.. ఏ బిల్లులు ఆపాలో కూడ తెలియని అజ్ఞానంతో కొట్టిమిట్టాడుతున్నారని.. శాసనసభలోకి రాలేని మేధావులకు నిలయంగా నాడు వైఎస్సార్ మండలిని ఏర్పాటు చేస్తే… రాజకీయ నిరుద్యోగులకు పునరావాసంగా అది మారిపోతుందని ఆరోపిస్తూ… దానివల్ల ప్రభుత్వ పథకాలు, బిల్లులు పోస్ట్ పోన్ అవుతున్నాయని ఆలోచిస్తూ… తద్వారా ప్రజలకు అందాల్సిన అద్భుతమైన అవకాశాలకు ఆటంకం ఏర్పడుతుందని భావిస్తూ… మండలిని రద్దుచేయ తీర్మానించింది వైకాపా సర్కార్. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపింది.

అయితే ఇప్పుడు ఆ బిల్లు రద్దు వ్యవహారం రోజు రోజుకీ పెండింగులో పడిపోతుంది. దానికి కరోనా వల్ల పార్లమెంటు సమావేశాలు ఎప్పుడు జరుగుతాయో తెలియకపోవడం ఒక కారణం కాగా… దేశవ్యాప్తంగా మండలి మీద ఒకే విధానం ఉండాలన్నది కేంద్రం ఆలోచనగా తెలుస్తోందనే కథనాలు రావడం మరో కారణం!! దీంతో రద్దు అవ్వకపోతే.. పొద్దు పొడిపించేద్దామని జగన్ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా అధికారికంగా, రాజమార్గంలోనే మండలిలో బలం సంపాదించి.. తద్వారా అనుకున్నది సాధించాలనే ఆలోచన చేస్తున్నారంట. ఎలాగూ వచ్చే ఏడాది జూన్ వరకూ ఆగితే వచ్చే బలం ఎలాగూ వస్తుంది. అదొక మార్గం అయితే… ఈలోపు మరో మార్గం కూడా ఆలోచిస్తున్నారంట.

ఇప్పటికే టీడీపీకి సంబందించిన శివారెడ్డి, పోతుల సునీత లు ఇప్పటికే వైకాపాకే జై అంటున్న తరుణంలో… మరో 10 – 12 మంది ఎమ్మెల్సీలు కూడా జగన్ కే జై అనడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. పెద్దల సభలో కూడా తమకు వ్యక్తిగత స్వేచ్చ లేదని.. చెప్పాలనుకున్న విషయం చెప్పలేకపోతున్నామని.. అసెంబ్లీలో మాదిరిగానే పార్టీ పద్దతిలోనే అంతా మాట్లాడాలని టీడీపీ అధినాయకత్వం సూచిస్తుందని.. కొందరు పెద్దలు బలంగా భావిస్తున్నారంట. ఈ క్రమంలో… జగన్ కే జై అంటున్నారంట.

అయితే.. అలా “జై” అన్నవారినందరికీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా జగన్ “సై” అనలేరు కాబట్టి… బాబుకు తనకూ తేడా లేదు అని జగన్ చెప్పలేరు కాబట్టి… డొక్కా మాణిక్య వరప్రసాద్ పద్దతినే ఫాలో అయితే… అది అధినేతకూ, సభ్యులకూ కూడా పద్దతిగా, రాజసంగా ఉంటుందని ఆలోచిస్తున్నారంట. ఇలా అన్నీ కలిసొస్తే… వీలైనంత తొందర్లో ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టి.. తనపని తాను నిరాటంకంగా చేసుకుపోవాలని జగన్ నిశ్చయించారని తెలుస్తోంది.