నిత్యం ప్రజాసేవలో తరిస్తామని, ప్రజల కోసం ఏమైనా చేస్తామని గత ఏడాది ఎన్నికలకు ముందు ప్రచారంలో ఊదరగొట్టారు. తమను గెలిపిస్తే.. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటామని కూడా చెప్పారు. అంతేకాదు, రాష్ట్రానికి సంబంధించి అనేక సమస్యలపై కేంద్రంతో పోరాడాల్సిన అవసరం ఉందని, తమను ఎన్నుకొంటే.. వాటిని సాదించేందుకు అలుపెరుగని కృషి చేస్తామని చెప్పారు. జగన్ సైతం 25 ఎంపీలు గెలిపిస్తే ప్రత్యేక హోదా తీసుకువస్తానని.. హోదా దానంతట అదే వస్తుందని చెప్పారు. దీంతో ప్రజలు వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేసిన ఎంపీ అభ్యర్థలు 22 మందిని మూకుమ్మడిగా గెలుపుగుర్రం ఎక్కించారు. ఒక్క శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు తప్ప.. మిగిలిన నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు పట్టంగట్టారు.
మరి ఇలా గెలిచిన ఎంపీలు ఏం చేస్తున్నారు ? నిజంగానే వారు ప్రజలకు చేరువగా ఉంటున్నారా ? ప్రజల మధ్యే ఉంటున్నారా ? ఏపీకి సంబంధించిన సమస్యలపై నిజంగానే పోరాడుతున్నారా ? అంటే.. ప్రశ్నార్థకంగానే ఉంది. నరసాపురం ఎంపీ రాజుగారు పార్టీకి దూరంగా ఉన్నారు. మిగిలిన వారిలో మాగంటి శ్రీనివాసులు, ఆదాల ప్రభాకర్‌రెడ్డి వంటి వారు తమ తమ బిజినెస్‌లు చూసుకుంటున్నారు. అసలు వీరికి ప్రజా సమస్యల పట్టవా ? అన్నట్టుగా ఉంది. పైగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఎంపీలు మాట్లాడే పరిస్థితి కూడా వైసీపీలో లేదు.
ఇక, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ను సొంత పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలే తీవ్రంగా విమర్శిస్తోన్నారు. అక్కడ గ్రూపు రాజకీయాలతోనే భరత్‌కు టైం సరిపోతోందని పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. ఇక, కడప ఎంపీ అవినాష్ రెడ్డి పార్టీ కార్యక్రమాలు చూస్తున్నారే తప్ప.. ప్రజలను పట్టించుకోవడం లేదని రూమర్లు వస్తున్నాయి. మహిళా ఎంపీల్లో గొట్టేటి మాధవి కొత్త కాపురంతోనే సరిపెట్టుకుంటున్నారట. పైగా ఆమె అరకు నియోజకవర్గంలో మినహా నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉన్న మిగిలిన నియోజకవర్గాల్లో తిరిగే పరిస్థితి లేదంటున్నారు.
ఇక ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ విదేశాల్లోనే ఎక్కువుగా ఉంటున్నారు. ఆయన ఇటీవలే స్వదేశానికి వచ్చారు. ఇక నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్థానికంగానే ఉండడంతో పాటు తమ నియోజకవర్గ పరిధిలో పట్టుకోసం పాకులాడుతున్నారు. పోలీస్ ఎంపీ గోరంట్ల మాధవ్ హిందూపురంలో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు తప్ప.. స్థానిక సమస్యలను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఢిల్లీలోనే ఉంటున్నారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కూడా సొంత పనుల్లోనే తీరిక లేకుండా గడుపుతున్నారు. ఆయనకు వ్యాపార వ్యవహారాలతోనే టైం సరిపోతోందట.
ఇక చింతా అనూరాధ, వంగా గీత, సత్యవతి, రంగయ్య, బల్లి దుర్గాప్రసాదరావు, సంజీవ్‌కుమార్ లాంటి వాళ్లు చేసేదేం లేదన్న టాకే వినిపిస్తోంది. ఓవరాల్‌గా ఏపీ రాజకీయాల్లో వైఎస్సార్ సీపీ ఎంపీల ఉనికి ఎక్కడా కనిపించడం లేదు. ఆ మధ్య.. రాజుగారిని బర్తరఫ్ చేయాలంటూ.. స్పీకర్ బిర్లాకు ఫిర్యాదు చేయడమే తప్ప. తర్వాత ఎవరూ కనిపించనే లేదు. మరి కొందరు ఎంపీలు మాత్రం పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తమకు ప్రయార్టీ ఉండడం లేదని.. ఏపీలో రాజకీయం చేయడం కంటే ఢిల్లీలోనే ఉండడం బెటర్ అని చర్చించుకుంటోన్న పరిస్థితి.