రాష్ట్రంలో ఏం జరిగినా తగుదనమ్మా అంటూ.. విమర్శలు గుప్పించే జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా మౌనం వహించారు. దాదాపు 12 మంది విశాఖ ఘటనలో మృతి చెందారు. వేల సంఖ్యలో ఇళ్లు వదిలి పారిపోయారు. ఈ మొత్తం ఎపిసోడ్‌పై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. జగన్ ప్రభుత్వం ఫెయిలైందని, ఎల్ జీ పాలిమర్స్ కంపెనీతో కుమ్మక్కయిందని, జగన్ ప్రభుత్వం చేసిన పనులన్నీ కూడా కుళ్లు , కుతంత్రాలతోనే కూడుకున్నవని, జగన్ ప్రభుత్వం వేసిన కమిటీలపై తమకు నమ్మ కం లేదని, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఇలా.. టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
అయితే, ఎప్పుడూ ఏం జరిగినా.. వెంటనే ఏదో ఒక మాధ్యమం ద్వారా స్పందించే పవన్ మాత్రం తాజాగా ఈ విషయంలో మాత్రం నోరెత్తలేదు. విషయంపై ఆయన మాట్లాడారు. జనసేన తరఫున కార్యకర్తలు , స్థానిక నేతలు అక్కడి బాధితులకు అండగా నిల వాలని, వారికి సాయం చేయాలని పిలుపు నిచ్చారు. అదేసమయంలో ప్రతిపక్షాలకు కూడా ఆయన కొన్ని హెచ్చరికలు చేశారు. ఇప్పుడు ఘర్షణ చేసే వాతావరణం కాదని, అందరూ అక్కడకు వెళ్లి ఆందోళన చేయడం కూడా సరికాదని, కరోనా వ్యాపిస్తుందని ఆయన ప్రకటనలు విడుదల చేశారు. అయితే, ఈ మొత్తం ఎపిసోడ్లో పవన్ అటు వ్యక్తిగతంగా జగన్‌ను కానీ, జగన్ ప్రభుత్వా న్ని కానీ ఒక్క మాట కూడా అనకపోవడం గమనార్హం.
గతంలో ఏపీలో పిల్లి కూత పెట్టినా.. కుక్క మొరిగినా.. కూడా పవన్ ఏదో ఒక విమర్శ చేసేవారు. కానీ, ఇప్పుడు మాత్రం ఆయన పూర్తిగా మౌనం దాల్చారు. మరి ఈపరిణామాలను గమనిస్తున్న విశ్లేషకులు.. అసలు ఏం జరిగిందనే విషయంపై దృష్టి పెట్టారు. తీరా చూస్తే.. కేంద్రంలోని బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్‌కు కేంద్రం నుంచే నిర్దిష్టమైన ఆదేశాలు ఉన్నాయని తెలుస్తోందని అంటున్నారు. ఎల్ జీ కంపెనీ వ్యవహారం అంతా కూడా కేంద్రం కనుసన్నల్లోనే నడుస్తోంది. ఈ క్రమంలో అటు ప్రభుత్వాన్ని, ఇటు కంపెనీని విమర్శిస్తే.. కేంద్రమే ఇరుకున పడుతుంది. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం సదరు కంపెనీకి భూములు, నీరు, విద్యుత్ వంటి సౌకర్యాలు మాత్రమే అందించి పన్నులు కట్టించుకుంటోంది.
మిగిలిన అనుమతులు అన్నీ కూడా కేంద్రమే ఇస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ మిత్రపక్షంగా ఉన్న పవన్.. విమర్శల జోలికి వెళ్తే.. అంతిమంగా బీజేపీకే నష్టమని భావించిన పెద్దలు ఈ మేరకు పవన్‌ను హెచ్చరించారని తెలుస్తోంది. ఇక, ఏపీలోని బీజేపీ నేతలు కూడా ఈ విషయంపై మౌనంగా ఉండడాన్ని విశ్లేషకులు తెరమీదికి తెస్తున్నారు. ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడిన సమయంలో కూడా ఎక్కడా జగన్‌ను కానీ, ఆయన మంత్రులను కానీ విమర్శించకపోవడం గమనార్హం. మొత్తానికి పవన్‌ను బీజేపీ బాగానే మేనేజ్ చేస్తోందని అంటున్నారు.