రైతన్నలకు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చే శుభవార్త ఇది. పంటకు పెట్టుబడి భారం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘అన్నదాత సుఖీభవ’ పథకం. కేంద్ర ప్రభుత్వం యొక్క ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’తో కలిసి మరో విడత నిధులు విడుదల చేయడానికి సిద్ధమైంది. అక్టోబర్ మాసం చివరిలో ఈ శుభవార్త రావడం రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఇంతకీ ఆ ‘ముహూర్తం’ ఎప్పుడు అనేది తెలుసుకుందాం..
అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. రైతులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ తేదీ నవంబర్ 18 అయివుంటుందని సమాచారం. ఈ రోజున, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన కింద ₹2,000 రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. దీనికి తోడుగా, రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత కింద ₹5,000 జమ చేస్తుంది.
మొత్తంగా, అర్హులైన ప్రతి రైతు ఖాతాలో ₹7,000 జమ అవుతాయి. దీపావళి పండుగ తరువాత, ఈ నిధులు జమ అవుతాయి అని సమాచారం తో రైతులకు రబీ సీజన్ పనుల కోసం, లేదా ఇతర ఆర్థిక అవసరాలకు ఈ సాయం పెద్ద ఊరటనిస్తుంది.

ఈ నిధులు సజావుగా మీ ఖాతాలో జమ కావాలంటే, రైతులు వెంటనే కొన్ని విషయాలు తప్పక చూసుకోవాలి. అందులో మొదటిది, మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ నంబర్, NPCI ద్వారా ఖచ్చితంగా లింక్ (జత చేయబడి) అయ్యిందో లేదో తనిఖీ చేసుకోండి. తరువాత పీఎం కిసాన్ పథకంతో పాటు ఈ పథకానికి కూడా e-KYC ప్రక్రియ తప్పనిసరి. పూర్తి చేయనివారు వెంటనే రైతు భరోసా కేంద్రాల్లో పూర్తి చేయాలి.
కౌలు రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అన్నదాత సుఖీభవ కింద ఏటా ₹20,000 వరకు అందిస్తోంది. మీ వద్ద సరైన క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డ్ (CCRC) ఉందో లేదో నిర్ధారించుకోండి. ఈ సాంకేతిక ప్రక్రియలన్నీ సక్రమంగా ఉంటే, నవంబర్ 18న నిధులు జమ కావడంలో ఎటువంటి జాప్యం ఉండదు.
గమనిక : నిధుల విడుదల తేదీలలో ఏదైనా మార్పు జరిగినా లేదా సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యమైనా దయచేసి అధికారిక ప్రకటనల కోసం రాష్ట్ర వ్యవసాయ శాఖ వెబ్సైట్ను లేదా స్థానిక రైతు భరోసా కేంద్రాన్ని (RBK) సంప్రదించండి.
