విశాఖ నగరం ప్రమాదకరంగా మారిపోతుంది.. తరచూ ప్రమాదాల బారిన పడుతుంది.. అర్ధరాత్రి పట్టపగలు అనే తేడా లేకుండా ఎప్పటికప్పుడు ఏదో ఒక భారీ ప్రమాదం చోటు చేసుకుంటుంది.. 2 రోజుల క్రితం భారీ క్రేన్ ప్రమాదం మరవకముందే విశాఖలో మరోసారి భారీ పేలుడు ఘటన చోటుచేసుకుంది. విశాఖ జిల్లాలోని అచ్చుతాపురం ప్రాంతంలో విజయ ఫార్మా కంపెనీలో ఈరోజు ఉదయం ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. పేలుడు జరిగిన వెంటనే ప్రజలు చెల్లాచెదురుగా పారిపోయారు. పేలుడు తీవ్రతకు భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడు తీవ్రతకు మంటలు తోడై దగ్గరలో ఉన్న రెండు ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
విజయ ఫార్మా కంపెనీ దగ్గరలోనే అగ్నిమాపక కేంద్రం ఉండటం వలన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకుని వచ్చే ప్రయత్నం చేశారు. ఈ ఫార్మా కంపెనీల లో జరిగే ప్రమాదాలతో విశాఖ నగరం వణికిపోతోంది. గత నెలలో వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఫార్మా కంపెనీ లలో పనిచేసే కార్మికులు భయాందోళనలు చెందుతున్నారు.