2020 చరిత్రలో తనకంటూ ఓ పేజీని రాసుకుంది. ఈ ఏడాది కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం అంతాఇంతా కాదు. కరోనా దెబ్బకు ప్రజలు భయం గుప్పెట్లో బ్రతుకుతున్నారు. ఇప్పుడిప్పుడే కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతూ వస్తుంది. తాజాగా మలేరియా జాతికి చెందిన కొత్త పరాన్నజీవి కేరళలో కలకలం రేపుతోంది.
ఇటీవల సూడాన్ నుంచి కేరళకి వచ్చిన ఓ సైనికుడి శరీరంలో దీన్ని కనుగొన్నారు. అతడి ద్వారా వచ్చిన ఈ కొత్త జాతి ‘ప్లాస్మోడియం ఒవల్‌గా’ గుర్తించారని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కెకె.శైలజ తెలిపారు. అతనికి కన్నూర్‌లోని జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు గురువారం ట్విటర్ వేదికగా ఆమె స్పందించారు. నివారణ చర్యలు చేపట్టడం ద్వారా, తగిన సమయానికి చికిత్స తీసుకోవటం ద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చు అని ఆమె పేర్కొన్నారు.
‘ప్లాస్మోడియం ఒవాలే.. మలేరియాకు చెందిన కొత్త పరాన్నజీవిని రాష్ట్రంలో గుర్తించాం.. ఓ సైనికుడిలో ఈ జన్యువును గుర్తించాం.. కన్నూరు జిల్లా ఆస్పత్రిలో అతడికి చికిత్స అందజేస్తున్నాం.. ఆయన ఇటీవలే సూడాన్ నుంచి వచ్చారు’ అని ఆరోగ్య మంత్రి తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సకాలంలో చికిత్స, నివారణ చర్యలతో వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చని మంత్రి అన్నారు. అంతేకాదు, ఈ పరాన్నజీవి ప్రాణాంతకమని ఇంత వరకు ఎటువంటి ఆధారాలేవన్నారు.
మలేరియాకు కారణమైన ప్రోటోజోవాను ఐదు రకాలుగా పేర్కొంటారు. ప్లాస్మోడియం వివాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిపరం, ప్లాస్మోడియం మలేరియా, ప్లాస్మోడియం నోలెసి, ప్లాస్మోడియం ఓవాలే. వీటిలో, ప్లాస్మోడియం వివాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిపరం దేశంలో సర్వసాధారణం. ప్లాస్మోడియం ఒవాలే సాధారణంగా ఆఫ్రికాలో కనిపిస్తుంది. దేశంలో తొలిసారిగా కరోనా వైరస్‌ను కేరళలోనే గుర్తించిన విషయం తెలిసిందే. వుహాన్ యూనివర్సిటీలో చదువుకునే కేరళ విద్యార్ధి.. చైనా నుంచి స్వదేశానికి చేరిన తర్వాత కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.