వాట్సాప్ కి మరో తల నొప్పి వచ్చి పడింది… వీడియో ఫైల్స్ రూపంలో ఉన్న ఒక వైరస్ అటాక్ చేస్తుంది. గత రెండు నెలల నుంచి వాట్సాప్ యాజమాన్యం పెగాసన్ వైరస్ తో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ దెబ్బకు భారత్ లాంటి వాట్సాప్ ఎక్కువగా వినియోగించే దేశాల్లో వినియోగదారుల సంఖ్య భారీగా తగ్గింది. ఆ తర్వాత ఎన్ని చర్యలు చేపట్టినా సరే ప్రజలు వాట్సాప్ ను వాడటానికి ఇష్టపడలేదని పలు సర్వేలు కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పలుదేశాల మంత్రిత్వ శాఖలు కూడా వాట్సాప్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించాయి.
ఒక ముక్కలో చెప్పాలి అంటే ఇజ్రాయెల్ నుంచి వచ్చిన ఈ వైరస్ వాట్సాప్ ప్రపంచాన్ని వణికించింది. ఇప్పుడిప్పుడే దాని నుంచి బయటకు వస్తున్నామని భావించిన వాట్సాప్ కు మరో తల నొప్పి వచ్చి పడింది. ఎంపీ4 వీడియో ఫైల్స్ రూపంలో హ్యకర్లు దాడికి యత్నిస్తున్నారని వాట్సాప్ యాజమాన్య సంస్థ అయిన ఫెస్బుక్ తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. అనుమాస్పద సోర్సుల నుంచి వీడియో ఫైల్స్ వచ్చి నప్పుడు కాస్త జాగ్రత్త వహించాలని ఫెస్బుక్ వినియోగదారులను హెచ్చరించింది. ఇక ఇందుకు ఒక పరిష్కారం కూడా సూచించింది…
ఆటో డౌన్‌లోడ్ ఆప్షన్ డిజేబుల్ చేయడం ద్వారా కూడా ఈ రకమైన సైబర్ దాడినుంచి తప్పించుకోవచ్చని పేర్కొంది. అయితే ఇప్పుడు ఈ సమస్య తీవ్రంగా ఉందని కొందరు టెక్ నిపుణులు అంటున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా సరే ఫోన్ మొత్తం మరొకరి చేతిలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని కాబట్టి దీని నుంచి చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని వాట్సాప్ లో కీలక సమాచారం ఉంచకుండా జాగ్రత్తలు పడాలని టెక్ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. కాగా మన దేశంలో వాట్సాప్ కు 40 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.