రాష్ట్రంలో బీజేపీ పరిస్తితి ఏంటి? అధ్యక్ష పగ్గాలు మారినా.. పార్టీ నిలదొక్కుకునేనా? లేక.. మరింతగా భ్రష్టు పట్టిపోతుందా? నిన్న మొన్నటి వరకు పార్టీ కి అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ తన వ్యవహార శైలితో పార్టీని భ్రష్టుపట్టించేశారా? మొత్తానికే కమలానికి బురద పూసేసి.. పార్టీ కొంపముంచేశారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం కొత్త సారధి సోము వీర్రాజు రంగంలోకి దిగారు. అయితే, ఈయన పార్టీని బిల్డప్ చేసే క్రమంలో గత అధ్యక్షుడు కన్నా చేసిన వ్యవహారాలతో ఏర్పడిన లోటు పాట్లను ఏమేరకు పూడుస్తారు? అనేది కీలకంగా మారింది.
కన్నా లక్ష్మీనారాయణ రెండు రకాలుగా పార్టీని భ్రష్టు పట్టించారని అంటున్నారు పరిశీలకులు. ఒకటి నేరుగా కేంద్ర బీజేపీ నేతలతో విభేదించడం, రెండు పార్టీ లైన్‌ను విభేదించి.. రాష్ట్ర అధికార పార్టీతో కయ్యానికి కాలుదువ్వడం. ఈ రెండు కారణాలతో ఆయన పదవిని పోగొట్టుకున్నారు. అయితే, ఈ పరిణామం.. పార్టీని కూడా దెబ్బతీయడమే ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని పార్లమెంటులోనే కేంద్రం స్పష్టం చేసింది. “గతంలో చంద్రబాబు అమరావతి అన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైనా సూచిస్తే.. దానికి మేం ఆమోద ముద్ర వేసేందుకు పరిశీలిస్తాం“
అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని కేంద్రంతో సఖ్యతగా ఉండే ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా చెప్పుకొస్తున్నారు. అయితే, దీంతో కన్నా విభేదించి.. రాజధాని విషయంలో మోడీ జోక్యం చేసుకుంటారు. రైతులకు అన్యాయం జరగదు.. అని చెప్పుకొచ్చారు. అదేసమయంలో జీవీఎల్ వంటి వారితోనే నేరుగా ఢీ అంటే ఢీ అంటూ.. రాజకీయాలు కొనసాగించారు. ఇది కూడా కన్నాకు ఎఫెక్ట్ అయినా.. రాష్ట్రంపైనా ప్రభావం చూపింది. దీంతో అమరావతి ప్రజలు కన్నా వ్యాఖ్యలు నమ్మారు. తమ విషయంలో మోడీ జోక్యం చేసుకుంటారని నిత్యం మోడీ ఫొటోలతో ఆందోళనకు దిగారు.
కట్ చేస్తే.. ఇప్పుడు కొత్తగా పార్టీ పగ్గాలు చేపట్టి సోముకు ఇది పెనుగండంగా మారింది. రాజధాని అమరావతి విషయంలో కన్నా చెప్పింది వాస్తవమా? కాదా? అనే విషయాన్ని స్పష్టం చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఔనని అంటే.. కేంద్రానికి, కాదంటే.. రాష్ట్ర ప్రజానీకానికి కూడా కోపం. ఇది కన్నా పెట్టిన మంట.. మరి ఇప్పుడు ఏం చేయాలనే ప్రశ్న ఆయనను వేధిస్తోంది. అదేసమయంలో కాంగ్రెస్ కన్నా దారుణంగా తయారవుతున్న పార్టీలోని అసంతృప్తులను బుచ్చగించాలి. మరి ఏం చేస్తారో చూడాలి.