విశాఖ జిల్లా నర్సీపట్నం సీనియర్ వైద్యుడు సుధాకర్‌రావు కీలక వ్యాఖ్యలు చేసారు. ఆయనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. నర్సీపట్నం మొత్తం పాజిటివ్ కేసులు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని ఆందోళన వ్యక్తం చేసారు. ఇక్కడ పేరుకే 150 పడకల ఆస్పత్రి, కనీస సౌకర్యాలు కరువు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. డాక్టర్లకే ఒక మాస్క్ ఇచ్చి 15 రోజులు వాడమంటున్నారని మండిపడ్డారు.
దానికి మళ్లీ సంతకం కూడా తీసుకుంటున్నారని అన్నారు. ఒక ఎమ్మెల్యే గానీ, మంత్రి గానీ ఆస్పత్రిని విజిట్ చేయరని ఆవేదన వ్యక్తం చేసారు. ఆస్పత్రి పరిస్థితులపై జిల్లా కో-ఆర్డినేటర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోరని అన్నారు. గైనకాలిజిస్ట్ కావాలని ఎప్పటి నుంచో అడుగుతున్నామన్న ఆయన… అనుభవం లేని జూనియర్ వైద్యురాలితో ఆపరేషన్లు చేయిస్తున్నారని మండిపడ్డారు.
ఇక్కడి పరిస్థితిని ముఖ్యమంత్రి చూడాలని ఆయన విజ్ఞప్తి చేసారు. కరోనా విజృంభనపై అవసరమైతే ప్రధానికి ఫిర్యాదు చేస్తా అని ఆయన హెచ్చరించారు. అసలు అక్కడ పట్టించుకునే వారు ఎవరూ లేరని ఆయన మండిపడ్డారు. అసలు మంత్రులు కూడా పరిస్థితిని అర్ధం చేసుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.