ఏపీలో చేపట్టే ప్రతి సాగునీటి ప్రాజెక్టుకు ఇబ్బందులు తప్పేలా లేదా.. ప్రస్తుతం ఏపీ ఇరిగేషన్ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. ఇటు కృష్ణా-అటు గోదావరి బేసిన్లల్లో ఏపీ చేపట్టే ప్రాజెక్టులపై డీపీఆర్ల పై కేంద్ర జల శక్తి మంత్రి పెట్టిన మెలికతో ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఈ క్రమంలో ఆయా ప్రాజెక్టులకు డీపీఆర్లు సమర్పించాక, ఇంకేం తలనొప్పులు ఎదురవుతాయోననే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇరిగేషన్ పరంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేసేలా కేంద్రం వ్యవహరిస్తోందనే భావన ఏపీ సర్కారులో వ్యక్తం అవుతోంది. కేంద్రం పెడుతున్న సవాలక్ష ఆంక్షలు.. అనేక రకమైన నిబంధలు చూస్తుంటే ఏపీలో ప్రాజెక్టుల నిర్మాణం ముందుకు వెళ్తుందా..అనే అనుమానాలు ఇరిగేషన్ వర్గాల్లో వ్యక్తమవుతోన్నాయి. పోలవరం ప్రాజెక్టుతో సహా.. ఇతర ప్రాజెక్టుల విషయంలో కూడా మరింత శ్రద్ధగా ఫోకస్ పెట్టి పనులను చకచకా జరిపించే దిశగా అడుగులు వేస్తుంది. అయితే కేంద్రం నుంచి ఈ తరహా అవాంతరాలు తలెత్తుతుంటే, తాము రూపొందించుకున్న ప్రణాళికలను అమలు చేయడం కష్టమనే భావన కన్పిస్తోంది.
కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ రాసిన లేఖలోని అంశాలు.. రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు సృష్టించేవిగా ఉన్నాయనే భావన ఇరిగేషన్ సర్కిల్సులో వ్యక్తమవుతోంది. ప్రస్తుతానికి ఏపీలో రాయలసీమ లిఫ్ట్ వరకే కేంద్రం ఏదో మెలిక పెడుతుందని భావిస్తున్నా.. తాజాగా గజేంద్రసింగ్ షెకావత్ రాసిన లేఖతో.. అసలు మొత్తం ప్రాజెక్టుల నిర్మాణం అనుకున్న రీతిలో, జరగడం ఎంత వరకు సాధ్యమనే భావన వ్యక్తం అవుతోంది.
ఇదే సందర్బంలో పాత ప్రాజెక్టులకు ఏమైనా మార్పులు చేర్పులు చేసినా.. వాటికీ డీపీఆర్లు.. పర్మిషన్లు కంపల్సరీ అని తేల్చి చెప్పింది కేంద్రం. ఇప్పుడిదే ప్రభుత్వానికి అతి పెద్ద సవాలుగా మారనుంది. కేంద్రం పంపిన జాబితా ప్రకారం.. ఏపీలో కృష్ణా బేసినులో నిర్మించే 15 ప్రాజెక్టులకు.. గోదావరి బేసిన్లో నిర్మించే నాలుగు ప్రాజెక్టులకు ముందుగా డీపీఆర్లు సమర్పించాలి.. ఆ తర్వాత మిగిలిన పర్మిషన్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడీ సమస్యను ఎలా అధిగమించాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడినట్లు తెలుస్తుంది. ఈ అంశానికి సంభందించి అమిత్ షాతో జగన్ ఢిల్లీలో కీలక చర్చలు జరిపినట్లు తెలుస్తుంది.