పోలవరం రివర్స్ టెండర్ ప్రక్రియలో ప్రధాన ఘట్టం ముగిసింది. పోలవరం ప్రధాన టెండరును మేఘా ఇంజనీరింగ్ సంస్థ దక్కించు కుంది. జల విద్యుత్ కేంద్రంతో పాటు ప్రధాన కాంక్రీట్ నిర్మాణ పనికి రూ.4987 కోట్లకు ప్రభుత్వం టెండర్ పిలవగా.. మేఘా ఇంజనీ రింగ్ సంస్థ రూ.4358 కోట్లకు కోట్ చేస్తూ టెండర్ దాఖలు చేసింది. గతంలో వివిధ సంస్థలు చేపట్టిన ధర కంటే 12.6% శాతం తక్కువకు మేఘా కోట్ చేసింది. దీంతో పోలవరం కాంట్రాక్టును మేఘా సంస్థ దక్కించుకుంది. కోర్టు అనుమతులు లభించిన వెంటనే మేఘా సంస్థ పనులను ప్రారంభించనుంది. రివర్స్ టెండరింగ్‌లో భాగంగా పోలవరం కాంట్రాక్టును రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తిరిగి టెండర్‌ను పిలిచిన విషయం తెలిసిందే.
పోలవరం హెడ్ వర్క్స్‌లో మిగిలిపోయిన పనులతో పాటు జల విద్యుత్ కేంద్రాలను కలిపి రివర్స్ టెండర్ పిలిచింది. కాగా, తాజా టెండరింగ్‌తో రూ.628 కోట్లు ఆదా అయ్యిందని ప్రభుత్వం చెబుతోంది. ఇక, ఇటీవల ఇదే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన రివర్స్ టెండర్‌లో 58 కోట్ల వరకు ప్రభుత్వానికి లబ్ధి చేకూరింది. ఇలా మొత్తంగా ప్రభుత్వం రివర్స్ టెండర్ ద్వారా ఏపీ ఖజానాకు నిధులు బాగానే మిగులుస్తోంది. ఇదిలావుంటే,ఆదినుంచి కూడా రివర్స్ విషయంలో రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నిన్న మొన్నటి వరకు కూడా తీవ్రంగా విమర్శించారు. రివర్స్ వల్ల ఒరిగేది ఏమీ ఉందని ఆయన నిప్పులు చెరిగారు.
అయితే, గతంలో చంద్రబాబు ఏ సంస్థలనైతే నమ్మి కాంట్రాక్టులు అప్పగించారో.. అవే సంస్థలు ఇప్పుడు తక్కువకు కోట్ చేయడం, పనులు ప్రారంభించేందుకు రెడీ కావడం వంటి పరిణామాలు గమనిస్తే.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన బిడ్డింగ్‌పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మేఘా కానీ, మ్యాక్స్ ఇన్ ఫ్రా కానీ, గతంలో చంద్రబాబు హయాంలో ఉన్న సంస్థలే. అయితే, అప్పట్లో భారీ మొత్తానికి బిడ్లు వేసిన ఈ సంస్థలే.. ఇప్పుడు చాలా తక్కువగా బిడ్లు వేయడం చూస్తే.. గత సర్కారు హయాంలో ఏదో జరిగిందనే విమర్శలు, సందేహాలు తెరమీదికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు వీటికి సమాధానం చెప్పాల్సి రావడం తథ్యమని అంటున్నారు విశ్లేషకులు.