ఎన్ని లోటుపాట్లు ఉన్నా..ఎంతగా ఎదురుదాడి జరిగినా.. ఎన్ని బెదిరింపులు వచ్చినా.. ఎన్ని ఆరోపణలు వచ్చినా.. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ రెండోసారి గద్దెనెక్కారు. ఒకవైపు బీజేపీ.. మరోవైపు కాంగ్రెస్..రెండూ కూడా కేజ్రీకి పీఠం దక్కకుండా అనేక ప్రయత్నాలు చేశాయి. అయినాకూడా ఆయన ఎంచుకున్న పథకా లు ఆయనను తిరిగి గద్దెపై కూర్చోబెట్టాయి. దీనిలో ప్రధానంగా కేజ్రీకి కలిసి వచ్చింది.. మోడల్ స్కూల్ పథకం. అప్పటి వరకు ఉన్న ఢిల్లీ విద్యావ్యవస్థను ఆయన కూకటి వేళ్లతో పెకలించి సంస్కరించారు. ఈ క్రమంలోనే పాఠశాలలను ఆయన కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ఆయన ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దారు. ఈ పరిణామం.. ఆయనకు ఎన్నికల్లో బాగా కలిసి వచ్చింది.
ఇప్పుడు ఇదే బాటలో ఏపీ సీఎం జగన్ కూడా నడుస్తున్నారు. నిజానికి ఢిల్లీ సీఎంను జగన్ అనుకరించక పోయినా.. ఇక్కడ కూడా అదే తరహాలో జరుగుతోంది కాబట్టి పోల్చి చూడాల్సి వస్తోంది. ఏపీ విషయానికి వస్తే.. తన ఎన్నికల మేనిఫెస్టోలోనే జగన్ ప్రజలకు హామీ ఇచ్చారు. తాను అధికారంలోకి వచ్చిన వెంట నే .. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి చేరుస్తానని చెప్పారు. చెప్పిన మాట ప్రకారం ఆయన `నాడు-నేడు` అనే బృహత్తర కార్యక్రమం అమలు చేస్తున్నారు.
తాజాగా దీనికి సంబంధించి పాఠశాలలకు వేసే రంగులను కూడా పేర్కొంటూ.. కొన్ని ఫోటోలను విడుదల చేశారు. వీటిని చూసిన తర్వాత.. నిజంగా ఇది అమలైతే.. జగన్‌కు తిరుగులేదు! అనే కామెంట్లు వస్తున్నాయి. మొదటి విడత నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా 15 వేలకు పైగా స్కూళ్లలో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. పేరెంట్స్ కమిటీలకు, మేదావుల కమిటీలకు, పాత విద్యార్థులకు కూడా ప్రాధాన్యం కల్పిస్తున్నారు. ఇక, ఈ నాడు-నేడు కోసం దాదాపు రూ.3600 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఇప్పటికి రూ.920 కోట్లను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. మిగిలిన నిధుల విడుదలను కూడా త్వరలోనే పూర్తి చేయనున్నారు.
ఆగస్టు 15 నాటికి మొదటి విడత నాడు–నేడు కార్యక్రమాలు పూర్తికావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే పాఠశాలలు సహా, హాస్టళ్లు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో రెండు, మూడో విడత నాడు–నేడు కార్యక్రమాల కోసం రూ.7700 కోట్లు ఖర్చు పెట్టి.. వాటి రూపురేఖలను మార్చనున్నారు. ఇది కనుక పూర్తిగా అమలై.. ప్రజల్లోకి వెళ్తే.. జగన్‌కు తిరుగులేదని అంటున్నారు పరిశీలకులు.