రేపు ఏపీలో మంత్రి వర్గ విస్తరణ…

-

మైనారిటీల నుంచి ఎన్‌.ఎం.డి.ఫరూక్‌,  ఎస్టీ వర్గాల నుంచి కిడారి శ్రావణ్‌ కుమార్‌లకు చోటు

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గాన్ని మరోసారి విస్తరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముహూర్తం ఖరారు చేశారు.  ఈ సారి ముస్లిం మైనారిటీల నుంచి ఎన్‌.ఎం.డి.ఫరూక్‌,  ఎస్టీ వర్గాల నుంచి కిడారి శ్రావణ్‌ కుమార్‌లకు చోటు కల్పిస్తున్నారు. ఆదివారం ఉదయం 11.45 గంటలకు ఉండవల్లిలోని ప్రజా వేదికలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం జరగనున్న నేపథ్యంలో  ఫరూక్, శ్రావణ్ లు అమరావతిలో అందుబాటులో ఉండాలంటూ సీఎంఓ నుంచి ఆదేశాలు జారీ చేశారు. మంత్రి వర్గ విస్తరణ సందర్భంగా.. తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ శనివారం సాయంత్రం విజయవాడ చేరుకోగానే సీఎం చంద్రబాబు నాయుడు గవర్నర్ ని కలిసి మంత్రి వర్గ విస్తరణ గురించి వివరించనున్నారు. దీంతో  ఆదివారం ఆయన కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

రాష్ట్ర మంత్రివర్గంలో ఇంతవరకు ముస్లిం మైనార్టీ, ఎస్టీ వర్గాలకు చోటు లేకపోవడంతో ఆ రెండు స్థానాలను వారితో భర్తీ చేయాలని భావించారు. కర్నూలు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్‌ నేత, శాసనమండలి ఛైర్మన్‌ ఎన్‌.ఎం.డి.ఫరూక్‌, ఇటీవల మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు శాసనసభ్యుడు కిడారి సర్వేశ్వరరావు కుమారుడు కిడారి శ్రావణ్‌ కుమార్‌లతో వీటిని భర్తీ చేయనున్నారు. భాజపాకి చెందిన కామినేని శ్రీనివాస్‌, పైడికొండల మాణిక్యాలరావు తమ మంత్రి పదవులకు రాజీనామాలు చేయడంతో… మంత్రి వర్గంలో రెండు స్థానాలు ఖాళీ అయిన విషయం తెలిసిందే. శ్రావణ్‌ వారణాసిలోని ఐఐటీ బీహెచ్‌యూలో ఇంజినీరింగ్‌ చదివారు. ఆయనకు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇవ్వనున్నారు. సర్వేశ్వరరావుతో పాటు, మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు మాజీ శాసనసభ్యుడు సివేరి సోమ కుమారుడిని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడిగా నియమించనున్నారు. ఓ వైపు తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావుడి జోరుగా సాగుతుండగా మరో వైపు ఏపీలో మంత్రి వర్గం విస్తరణతో పాలనను పరుగులు పెట్టించే పనిలో చంద్రబాబు ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news