ఏపీ పంచాయతీ ఎన్నికలు..ఏం జరుగబోతుంది ?

-

పంచాయతీ ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏపీలో రాజకీయ వాతావరణం చల్లబడింది. న్యాయస్థానం తీర్పును స్వాగతించిన విపక్షాలు, ప్రభుత్వంపై మాత్రం దుమ్మెత్తిపోస్తున్నాయి. చట్టాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని తూర్పారబడుతున్నాయి. సుప్రీంకోర్టులో తీర్పు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ ప్రజల మనసు గెలుచుకున్నామంది ప్రభుత్వం. ఎన్నికలకు సిద్ధమని ప్రకటించింది. ఇప్పుడు ఏం జరుగబోతుంది..

ఎస్‌ఈసీ విధుల్లో భాగంగానే ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఏదో వంకతో ఎన్నికలు ఆపాలని చూడడం తగదన్న అత్యున్నత న్యాయస్థానం..కరోనా ప్రభావం తగ్గినప్పుడు ఎందుకు వద్దంటున్నారని ప్రశ్నించింది. ఉద్యోగులు పనిచేయకుండా పిటిషన్లు వేయడం ప్రమాదకరమని మందలించింది. ఎన్నికలు జరపాల్సిందేనంటూ ఆదేశించింది.

ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో జరిగిన రాజకీయం ఉత్కంఠభరిత క్రికెట్ మ్యాచ్‌ను తలపించింది. ప్రభుత్వం.. ఎస్‌ఈసీ మధ్య జరిగిన హోరా హోరీ పోరులో సుప్రీం వేదికగా ఎస్‌ఈసీ విజయం సాధించారు. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణ విషయంలో సుప్రీం కోర్టు ఎస్‌ఈసీకి అనుకూలంగా తీర్పు వెలువరించిన వెంటనే ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ అత్యంత నేర్పుగా వ్యవహరించారు. ఎవ్వరికి అంతుబట్టని విధంగా వ్యవహరించారు. ప్రభుత్వం నుంచి ఎదురయ్యే ప్రశ్నలు.. వారి నుంచి వచ్చే వినతులు.. ఉద్యోగ సంఘాల రియాక్షన్‌లు ముందుగానే ఊహించిన నిమ్మగడ్డ ఆ మేరకు ముందుగానే సిద్దం చేసుకున్న ప్రణాళికను అమలు చేసేశారు.

ఇక ఏపీ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు సిద్ధమైంది. సుప్రీంతీర్పును గౌరవిస్తున్నామన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రజారోగ్యం కోసమే ఇన్నాళ్లు ఎన్నికలు వద్దనుకున్నామన్నారు. ఎస్‌ఈసీ నిర్ణయించినట్టుగానే ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని చెప్పారు.

సుప్రీంకోర్టు తీర్పు పట్ల ఇటు టీడీపీ అటు బీజేపీ సుప్రీం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికలను పక్కన పెట్టి పంచాయతీ ఎన్నికలను షెడ్యూల్ చేయడం పైనే ఇప్పుడు ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఇక పోలింగ్,వ్యాక్సినేషన్ రెండు ఏకకాలంలో ఎలా జరపాలనేదానిపై కేంద్రం సలహాను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది.

ఎన్నికలను రీ-షెడ్యూల్‌ చేయడం ద్వారా నిమ్మగడ్డ తెలివిగా వ్యవహరించారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. నామినేషన్‌ పత్రాలు.. ఓటర్ల జాబితాలు ఏవీ సిద్దంగా లేవు. అలాగే పోలింగ్‌ స్టేషన్లు కూడా రెడీగా లేవు. ఈ క్రమంలో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఎన్నిక నిర్వహించాలంటే ప్రభుత్వం చేతులెత్తేస్తుంది. ఇటు ప్రభుత్వానికి ఆ అవకాశం ఎంత మాత్రం ఇవ్వకూడదనే ఉద్దేశ్యం.. అటు సర్కార్‌కు వెసులుబాటు కలిగించినట్టు అవుతుందనే వ్యూహంతో పంచాయతీ ఎన్నికలను రీ-షెడ్యూల్‌ చేశారు నిమ్మగడ్డ.

Read more RELATED
Recommended to you

Latest news