ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై ఆసుపత్రుల్లో పుట్టిన శిశువులకు వెంటనే ఆధార్ ఎన్రోల్మెంట్ నంబర్ రానుంది. ఈ ప్రక్రియను త్వరలో ప్రారంభించడానికి వైద్యశాఖ సిద్ధమైంది. ఆధార్ ఎన్రోల్మెంట్ చేపట్టడానికి ఏరియా, జిల్లా, బోధన ఆసుపత్రులకు అవసరమైన ట్యాబులు, ఫింగర్ ప్రింట్ స్కానర్ లను సమకూర్చారు.
త్వరలోనే ఆసుపత్రుల్లో పుట్టిన పిల్లలకు బర్త్ రిజిస్ట్రేషన్ తరహాలోనే శిశు ఆధార్ ఎన్రోల్మెంట్ చేపట్టనున్నారు. ఈ ఆధార్ ఎన్రోల్మెంట్ కోసం డేటా ఎంట్రీ ఆపరేటర్లకు యుఐడిఏఐ ఓ పరీక్ష నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించిన వారికి ఆధార్ ఎన్రోల్మెంట్ పై ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు.
ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఆధార్ ఎన్రోల్మెంట్ ప్రక్రియ మొదలవుతుంది. ఐదేళ్ల లోపు పిల్లలకు నీలిరంగులో తాత్కాలిక ఆధార్ ను జారీ చేస్తుంది. దీనికోసం శిశువుల బయోమెట్రిక్ డేటాతో పనిలేదు. పిల్లల ఫోటో, తల్లిదండ్రుల పేరు, చిరునామా, మొబైల్ నెంబర్ ,ఆధార్ నెంబర్ తదితర వివరాల ఆధారంగా శిశువుకు తాత్కాలిక ఆధార్ జారీ చేస్తారు.