వైజాగ్ లో రేపటి నుంచి రెండు రోజుల పాటు ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (జీఐఎస్) జరగనుంది. ఈ అంతర్జాతీయ స్థాయి కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టింది. దీనిపై రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ స్పందించారు. రెండు రోజుల జీఐఎస్ సదస్సులో పర్యాటక, ఆతిథ్య రంగాల్లో ఏపీకి రూ.25 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. రాష్ట్రంలో పర్యాటక, ఆతిథ్య రంగాల్లో పెట్టుబడులకు భారీ అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ సూచించారని రజత్ భార్గవ వ్యక్తపరిచారు.
ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు తొలిరోజే 7 పెద్ద ఎంవోయూలు చేసుకోబోతున్నామని అన్నారు. ఒక్కో ఎంవోయూ విలువ రూ.1000 కోట్లకు పైనే ఉంటుందని తెలిపారు. మార్చి 3, 4 తేదీల్లో జరిగే ఈ సదస్సులో వివిధ శాఖలకు సంబంధించి 125 ఎంవోయూలు కుదుర్చుకునే అవకాశం ఉందని తెలిపారు.