భారీ వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలం అయింది. గుర్రం చెరువుకు గండిపడటంతో పాతబస్తీకి భారీ నష్టం వాటిల్లింది. ఓల్డ్‌సిటీలోని దాదాపు అన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలో నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా వరదనీరు రావడంతో ఏం జరిగిందోనని తేరుకునే లోపే ఇళ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో చిన్నపిల్లలు, వృద్ధులను కాపాడుకునేందుకు పాతబస్తీవాసులు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. ఐదార్రోజులుగా వరదలోనే చిక్కుకున్న ఇళ్లు వేలల్లో ఉన్నాయి. వరద ఉద్ధృతి నుంచి కోలుకునే లోపే మరోసారి భారీవర్షం పడటంతో ప్రజలు బిక్కు బిక్కుమంటున్నారు.
పాతబస్తీ బాబానగర్ ప్రాంత వాసులు సర్వస్వం కోల్పోయారు. టోలీచౌక్‌లోని నదీంకాలనీ పూర్తిగా నీట మునిగింది. దీంతో పాటు విరాహత్ నగర్, నీరజ్ కాలనీ, బాలరెడ్డి నగర్ కాలనీల్లో వరద నీరు చేరింది. పాతబస్తీ జల్పల్లి మున్సిపాలిటీలోని బుర్హాన్ పూర్ చెరువు నిండటంతో వెనుక ఉన్న ఉస్మాన్ నగర్, షాహీన్ నగర్ ప్రాంతం మంపునకు గురయ్యాయి. గత పదిరోజుల నుంచి పరిస్థితి అలాగే ఉందని స్థానికులు చెబుతున్నారు. పల్లె చెరువు నుంచి వచ్చే వరద నీటితో ఫలక్ నుమా వంతెన దెబ్బతింది. వరదతో అల్జుబల్ కాలనీ, జీఎం కాలనీ, ఆషామాబాద్ కాలనీలు పూర్తిగా నీటమునిగాయి.