దేశవ్యాప్తంగా ఉన్న యాపిల్ వినియోగదారులకు శుభవార్త. యాపిల్ కంపెనీ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌ను బుధవారం నుంచి ప్రారంభించింది. ఈ స్టోర్ ప్రస్తుతం వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఇందులో యాపిల్‌కు చెందిన అన్ని ప్రొడక్ట్స్‌ను కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు. క్రెడిట్, డెబిట్ కార్డులు, నెట్‌బ్యాంకింగ్ ద్వారా యాపిల్ ప్రొడక్ట్స్‌ను కొనవచ్చు. క్రెడిట్ కార్డు ద్వారా ఈఎంఐ విధానంలో ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేసే సౌకర్యాన్ని కూడా అందిస్తున్నారు. ఇక యాపిల్ ప్రొడక్ట్స్‌ను కొన్నవారికి వాటిని ఇంటికి ఉచితంగానే హోం డెలివరీ చేస్తారు.
ఇక కస్టమర్లు యాపిల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో ఏ ప్రొడక్ట్ ను కొన్నా సరే దాన్ని 24 నుంచి 72 గంటల్లోగా డెలివరీ చేస్తామని యాపిల్ తెలిపింది. అలాగే పాత ఐఫోన్లు, శాంసంగ్ ఫోన్లు, వన్ ప్లస్ ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేసి ఆ మొత్తానికి సరిపోయే విధంగా కొత్త ఐఫోన్లను కూడా యాపిల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో కొనవచ్చు. ఆ స్టోర్‌లో కొన్న వస్తువులకు యాపిల్ కేర్ ప్రొటెక్షన్ లభిస్తుంది. అలాగే కొనుగోలు చేసిన డివైస్ ల గురించి తెలుసుకునేందుకు స్టోర్‌లో యాపిల్ నిపుణులను ఉచితంగా సంప్రదించి సలహా తీసుకోవచ్చు. ఏదైనా ప్రొడక్ట్ కొనాలంటే ఆ ప్రొడక్ట్‌కు చెందిన వివరాలను కూడా ఆయా నిపుణులను స్టోర్‌లో అడిగి తెలుసుకోవచ్చు. కస్టమర్లు తమకు కలిగే సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
యాపిల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో ఏదైనా హెల్ప్ కావాలంటే నిపుణులు ఇంగ్లిష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటారు. అలాగే మాక్ వంటి డివైస్‌లను సెటప్ చేసేందుకు కావల్సిన సహాయాన్ని కూడా ఉచితంగా అందిస్తారు. ఇక స్టోర్ లాంచింగ్ సందర్భంగా యాపిల్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. అందులో ఏవైనా ప్రొడక్ట్స్‌ను హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డులతో కొంటే 6 శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అక్టోబర్ 16వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అందుకు గాను కనీసం రూ.20,900 ఆపైన స్టోర్‌లో కొనుగోళ్లు చేయాలి. https://www.apple.com/in/shop అనే వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా వినియోగదారులు యాపిల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లోకి వెళ్లి తమకు కావల్సిన యాపిల్ ప్రొడక్ట్స్ ను కొనుగోలు చేయవచ్చు.