కరోనా వైరస్ దెబ్బకు బాగా నష్టపోయిన రంగం ఆర్టీసి. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా నష్టపోయింది ఆర్టీసి. ఒక్క బస్సు కూడా బయటకు వచ్చి తిరిగే పరిస్థితి కనపడటం లేదు. ప్రజలు కూడా రోడ్ల మీదకు రావడానికి భయపడుతున్నారు. ఇప్పట్లో ఒక్క బస్ కూడా రోడ్ మీదకు వచ్చి తిరిగే పరిస్థితి లేదని అంటున్నారు. ఈ తరుణంలో ఆర్టీసి భారీ నష్టాలను ఎదుర్కొంటుంది. ఉద్యోగులకు జీతాలను చెల్లించాలి.
అదే విధంగా కొన్ని నిర్వహణ ఖర్చులు కూడా ఉంటాయి. తీసుకున్న అప్పులకు వడ్డీలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. తెలంగాణాలో లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఈ నెల రోజుల్లో రూ.400 కోట్ల మేర రాబడి రాకుండాపోయింది. ప్రతి నెలా వేతనాల కింద రూ.120 కోట్ల వరకు చెల్లించక తప్పదు. మార్చిలో 10 రోజులు, ఏప్రిల్ నెల మొత్తం… అంటే 40 రోజుల వేతనాన్ని సంస్థ చెల్లించే అవకాశం ఉంది.
దీనితో ఇప్పుడు బస్సులు బయటకు వస్తే మాత్రం భారీగా టికెట్ ధరలను పెంచాలి అని భావిస్తున్నారు. కిలోమీటర్ కి దాదాపుగా 20 పైసల వరకు పెంచే అవకాశం ఉందని సమాచారం. ఇక రిజర్వేషన్ టికెట్ ధరలను కూడా పెంచాలని భావిస్తున్నారు. దూర ప్రాంతాలకు వెళ్ళే ఏసీ, నాన్ ఏసీ, స్లీపర్ బస్సుల ధరలను పెంచే విధంగా ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి.