కరోనాను అడ్డుకునేందుకు గాను ప్రపంచ వ్యాప్తంగా అందిస్తున్న కోవిడ్ టీకాలన్నీ ఇంట్రామస్కులర్ టీకాలే. వాటిని కండరాలకు ఇస్తారు. అయితే ఆ టీకాల కన్నా ముక్కు ద్వారా అందించే టీకాలే సమర్ధవంతంగా పనిచేస్తాయని, అవి గేమ్ చేంజర్స్ అవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే పలు కంపెనీలు నాసల్ వ్యాక్సిన్స్‌కు గాను క్లినికల్ ట్రయల్స్ ను నిర్వహిస్తుండగా.. అవి కోవిడ్‌ను సమర్థవంతంగా అడ్డుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆల్ట్ ఇమ్యూన్, యూనివర్సిటీ హాంగ్ కాంగ్, మెయిస్సా వ్యాక్సిన్స్, కోడాజీనిక్స్, క్యూబా సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజినీరింగ్ అండ్ బయోటెక్నాలజీ సంస్థలు ముక్కు ద్వారా అందించే నాసల్ కోవిడ్ వ్యాక్సిన్లను అభివృద్ది చేసి వాటికి గాను క్లినికల్ ట్రయల్స్ ను నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే త్వరలో వాటికి చెందిన ఫలితాలు రానున్నాయి.
ఇక మన దేశంలో భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్‌తోపాటు ముక్కు ద్వారా అందించే నాసల్ వ్యాక్సిన్‌కు ట్రయల్స్ చేపడుతోంది. అయితే ఇంట్రా మస్కులర్ వ్యాక్సిన్ కన్నా నాసల్ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంట్రామస్కులర్ వ్యాక్సిన్ అయితే శరీరంలోకి ప్రవేశించే ఇన్‌ఫెక్షన్‌ను ఒక్కోసారి అడ్డుకోకపోవచ్చు. దీంతో ఇన్ఫెక్షన్ వ్యాపించే అవకాశాలు ఉంటాయి.
ఇక నాసల్ వ్యాక్సిన్ అయితే శరీరంలో 3 రకాలుగా ఇన్‌ఫెక్షన్ రాకుండా అడ్డుకుంటుంది. దీంతో కోవిడ్ రాకుండా సమర్థవంతంగా అడ్డుకోవచ్చు. దీని వల్ల కోవిడ్‌ను పూర్తి స్థాయిలో నియంత్రించవచ్చు. అందువల్ల నాసల్ వ్యాక్సిన్లు గేమ్ చేంజర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సైంటిస్టులు చెబుతున్నారు.