ఉదయం లేవగానే ఎనర్జీ నిండిన బ్యాటరీలా ఉంటేనే రోజంతా చాలా తాజాగా ఉండగలము. అలా కాకుండా పొద్దున్నపూట కూడా అలసిపోతున్నట్లయితే అదేదో పెద్ద సమస్యే ఉందని అర్థం చేసుకోవాలి. రాత్రంతా నిద్రపోయి విశ్రాంతి తీసుకున్న శరీరం, లేవగానే అలసిపోతుందంటే దానికి కారణం డి విటమిన్ లోపం కావచ్చు. ఈ లోపం వల్ల రక్తపీడనంపై ప్రభావం పడుతుంది. అదే కాదు నాడీ సంబంధ సమస్యలు ఉన్నా కూడా పొద్దున్న పూట లేవగానే అలసిపోయినట్టుగా ఫీలవుతారు. డయాబెటిస్, బీపీ మొదలగు సమస్యల వల్ల ఇది జరగవచ్చు. ఇలా ప్రతీ రోజూ జరుగుతున్నట్టయితే జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. లేదంతే ఎముకలు బలహీనంగా మారిపోయి అనేక ఇతర సమస్యలకు దారి తీస్తుంది.
మరి దీన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.
ప్రోటీన్
శరీర కణజాలాల తయారీకి ప్రోటీన్లు చాలా అవసరం. అందుకోసం పాలు, మాంసం, ఫౌల్ట్రీ, సోయాబీన్స్ మొదలగునవి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది శరీరానికి సరైన పోషణ అందించి, ఆరోగ్యాన్ని పెంచుతుంది. తద్వారా కావాల్సిన అన్ని విటమిన్లు శరీరానికి అందుతాయి.
కాల్షియం
ఎముకలు, దంతాలు మాత్రమే కాకుండా కండరాలు, గుండెను ఆరోగ్యంగా ఉంచే వాటిలో కాల్షియం కూడా ఒకటి. పెరుగుతున్న పిల్లలకి ఇది తప్పనిసరిగా అందించాలి. పాలు, పెరుగు, జున్ను, టోఫు, బచ్చలికూర, బ్రోకలీ, సోయాబీన్స్ మొదలగు వాటిల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది.
ఫైబర్
మీరు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచాలనుకుంటే, ఫైబర్ అధికంగా ఉండే వాటిని తినండి. ఇందుకోసం ఆపిల్, ఓట్స్, తృణధాన్యాలు తినడం మంచిది.
ఇనుము
రక్తంలో సరైన పాళ్ళలో ఇనుము లేకపోతే అది ఇలాంటి అలసత్వానికి దారి తీసే అవకాశం ఉంది. అందుకే ఇనుము తగినంతగా దొరికే ఆహారాలని తీసుకోవాలి. తృణధాన్యాలు, బీన్స్, కాయలు, దానిమ్మ, దుంపలు, ఆకుకూరలలో ఇది దొరుకుతుంది.