కొంతమందికి కొన్ని ఇన్‌బిల్ట్ అలవాట్లు ఉంటాయి. అవి ఎంత వద్దు అనుకున్నా చెయ్యి ఊకే లాగేస్తుంటుంది. చెవిలో ఏం లేకున్నా ఈర్ బడ్స్‌తో తిప్పేసుకుంటారు, ముక్కుల్లో వేలుపెట్టుకోవడం, ముఖం మీద వచ్చిన పింపుల్స్‌ను గిల్లడం.. ఇవన్నీ చెడ్డ అలవాట్లు. కానీ ఇవి చేస్తుంటే.. ఒకరకమైన బ్లడీ శాటిస్‌ఫ్యాక్షన్ వస్తుంది కదా..! చాలామంది మొటిమలను గిల్లి అందులో ఉన్న ద్రవాలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తారు. ఇలా చేయడం వల్ల చర్మానికి చాలా నష్టం కలుగుతుంది. అక్కడ ఎర్రగా మారి ఉబ్బినట్టు అవుతుంది. మొటిమలు లోతుగా చర్మం లోపలికి పాకుతాయి. దీనివల్ల అక్కడ గుంతలు పడే అవకాశం ఉంది. ఆ గుంతలు జీవితాంతం అలానే ఉంటాయి. ఎప్పటికీ పూడుకుపోవు.
మొటిమలను గిల్లితే…
మొటిమలు వచ్చినప్పుడు వాటిని వేలితో తాకకుండా వదిలేయాలి. చాలామంది రెండు వేళ్ళతో పిండుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఆ మొటిమ త్వరగా తగ్గినట్టు అనిపించినా, తర్వాత మాత్రం మరింతగా మొటిమలు వచ్చే అవకాశం పెరుగుతుంది. అలాగే అక్కడ చర్మం విరిగిపోయేలా, ఇన్ఫెక్షన్‌కు దారి తీసేలా మార్పులు జరుగుతాయి. మొటిమలు వస్తే అలా వదిలేయాలి. చేతులతో పదేపదే తాకుతూ, నొక్కుతూ ఉండకూడదు.
మొటిమలను చేత్తో నొక్కి పిండడం వల్ల అక్కడ కొంత కణజాలం కోల్పోతారు. దీనివల్ల అక్కడ మచ్చలు లేదా గుంతల పడతాయి. మొటిమలను నయం చేసే కొన్ని రకాల క్రీములు ఇప్పుడు వచ్చాయి. అవి మొటిమలను రాకుండా ఆపలేవు, కానీ వచ్చిన మొటిమను త్వరగా తగ్గేలా చేస్తాయి. మొటిమల మీద వేడి క్లాత్‌తో కాపడంలా పెడితే అవి త్వరగా పక్వానికి వచ్చి మానిపోతాయి.
ఒక వయసులో మొటిమలు వచ్చి పోవడం సహజం. ఆ దశ దాటాక అవి మళ్లీ రావు. కాబట్టి ఆ దశను దాటేంతవరకు వాటిని పట్టించుకోకండి. పదే పదే వాటిని చేత్తో నొక్కుతూ ఉండడం వల్ల అక్కడ నల్లటి మచ్చలు, గుంతలు ఏర్పడి జీవితాంతం మిమ్మల్ని వెంటాడుతాయి. మీ అందానికి మచ్చలా మారుతాయి. కాబట్టి మొటిమల గురించి ఆందోళన చెందకుండా వదిలేయడం ఉత్తమం.