కాశ్మీర్ లో ఆర్మీ చెలరేగిపోతుంది. నిఘా వర్గాల సమాచారంతో భారత ఆర్మీ ఉగ్రవాదుల కదలికలపై ఎప్పుడూ అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. వాళ్ళ సమాచారం అందితే చాలు క్షణాల్లో అక్కడ వాలిపోతూ వారిని కాల్చి చంపడమో లేక అదుపులోకి తీసుకోవడమో చేస్తూ వస్తుంది. ఇక తాజాగా గత ఏడాది జైషే మహ్మద్ ఆత్మాహుతి దాడికి పాల్పడిన పుల్వామాలో ఉగ్రవాదుల రహస్య స్థావరాలను జమ్మూ పోలీసులు కనుగొన్నారు.
పక్కా సమాచారంతో దాడులకు దిగారు. పుల్వామా నగరంలోని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులకు అక్కడ ఉండే స్థానికులు కొందరు ఆశ్రయంతో పాటు రవాణ వాహనాలను అందిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దీనిపై దర్యాప్తు చేయగా సంచలన విషయాలు బయటపడ్డాయి. జైషే మహ్మద్ కు చెందిన ఉగ్రవాదులతో సంబంధాలున్న నలుగురిని అవంతిపురా పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు.
అవంతిపుర పట్టణంలోని ఖ్రీ ప్రాంత౦లో నివాసం ఉండే మహ్మద్ అమీన్, మహ్మద్ రఫీఖ్, ఫయాజ్ లోని, మక్బూల్ దార్ లను పోలీసులు అరెస్టు చేసారు. వీరు నలుగురూ కూడా జైషే ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చి వారి ప్రయాణాలకు వాహనాలు కూడా అందిస్తున్నారని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. అదే విధంగా వారిపై కేసులు నమోదు చేశారు. ఇక వీరిని కూడా ఉగ్రవాదుల జాబితాలో చేర్చారు అధికారులు.