భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే తన కేబినెట్‌లో పలు మార్పులు, చేర్పులు చేసిన విషయం విదితమే. అందులో భాగంగానే కొందరు మంత్రులను తొలగించి కొందరు సహాయ మంత్రులను ప్రమోట్ చేశారు. ఇక కొందరు కొత్త వారిని మంత్రులుగా తీసుకున్నారు. వారిలో కేంద్ర ఐటీ, సమాచార శాఖకు నియమించబడిన అశ్విని వైష్ణవ్ ఒకరు. అంతకు ముందు రవిశంకర్ ప్రసాద్ ఈ శాఖను చూసేవారు. తాజాగా అశ్విని వైష్ణవ్ కు ఆ శాఖ బాధ్యతలను అప్పగించారు. ఈ క్రమంలోనే ఆయన మంత్రి హోదాలో తొలిసారిగా కొత్త ఐటీ రూల్స్‌పై స్పందించారు. ఈ మేరకు కూ యాప్‌లో ఆయన ఖాతా ఓపెన్ చేసి పోస్టులు పెట్టారు.
కేంద్ర ప్రభుత్వం కొత్తగా అందుబాటులోకి తెచ్చిన నూతన ఐటీ రూల్స్ వల్ల సామాన్య ప్రజలకు ఎంతగానో మేలు జరుగుతుందని అశ్విని వైష్ణవ్ అన్నారు. సోషల్ మీడియా ఎకో సిస్టమ్ మరింత బాధ్యతగా, సురక్షితంగా ఉంటుందన్నారు. దీని వల్ల యూజర్లకు రక్షణ లభిస్తుందని, సాధికారతను పొందవచ్చని అన్నారు.
కాగా ఆదివారం ట్విట్టర్ ఇండియా నూతన ఐటీ చట్టాలను అనుసరిస్తున్నట్లు ప్రకటించడమే కాక గ్రీవెన్స్ అధికారిని నియమించింది. ఆ తరువాత కూ యాప్‌లో అశ్విని వైష్ణవ్ ఆ విధంగా స్పందించారు. ఈ ఏడాది మే26వ తేదీ నుంచి దేశంలో నూతన ఐటీ రూల్స్ అమలులోకి వచ్చాయి. గూగుల్, ఫేస్‌బుక్ సహా ఆ రూల్స్‌ను పాటిస్తామని తెలిపాయి. కానీ ట్విట్టర్ మొదట అందుకు విముఖతను వ్యక్తం చేసింది. ఇక తాజాగా ట్విట్టర్ ఆ రూల్స్ ను పాటిస్తామని తెలిపింది. ఈ క్రమంలోనే మొదటగా 133 పోస్టులను తొలగించినట్లు, 18వేల అకౌంట్లను సస్పెండ్ చేసినట్లు ట్విట్టర్ వెల్లడించింది.