‘ఆమిర్.. ఇప్పుడు మీరు మా రాష్ట్రానికి రావొద్దు..’

-

లాల్ సింగ్ చద్దా సినిమా విషయంలో వివాదంలో చిక్కుకున్న ఆమిర్ ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయణ్ను తమ రాష్ట్రానికి ఇప్పట్లో రావొద్దని చెప్పారు. ఇంతకీ ఆ ముఖ్యమంత్రి ఎవరు..? ఆమిర్ ను ఎందుకు రావొద్దన్నారు..?

బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తమ రాష్ట్ర సందర్శనను వాయిదా వేసుకోవాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కోరారు. ప్రస్తుతం తాము హర్‌ ఘర్ తిరంగా వేడుకల్లో నిమగ్నమై ఉన్నామని.. ఈ నెల 15 తర్వాతనే ఇక్కడకు వచ్చేలా చూసుకోవాలని సూచించారు.

‘ఆమిర్‌ ఖాన్ ఈ రాష్ట్రాన్ని సందర్శించాలనుకుంటున్నారు. దాని గురించి నాతో మాట్లాడారు. ఈసారి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మేం హర్‌ ఘర్ తిరంగా ఉత్సవాన్ని జరుపుకొంటున్నాం. ప్రస్తుత సమయంలో ఈ అంశం పక్కకు వెళ్లకూడదని భావిస్తున్నాం. అందుకే ఆయన పర్యటనను వాయిదా వేసుకోవాలని కోరుతున్నాం. 15 తర్వాతనే ఆయన రాష్ట్రంలో పర్యటించాలనుకుంటున్నాం’ అని వెల్లడించారు.

ఆమిర్ ఖాన్ నటించిన లాల్‌ సింగ్ చడ్డా ఇటీవలే విడుదలైంది. తన సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆగస్టు 14న గువాహటికి వెళ్లాలనుకున్నారు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థనతో దానిని ఆగస్టు 16కు వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమిర్‌ తమ రాష్ట్రానికి వచ్చినప్పుడు తనతో కలిసి సినిమా వీక్షిస్తానని హిమంత చెప్పినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల అస్సాంకు ఈ బాలీవుడ్ నటుడు వరద సాయాన్ని అందించారు. దీనిపై హిమంత అభినందనలు కూడా తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news