ఇవి ఫ్రీ కాదు.. అంతకు మించి ఏం చెప్పలేను : సీఎం స్టాలిన్

-

దేశమంతా ఉచితాలపై చర్చ సాగుతోంది. సంక్షేమ పథకాలపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, విపక్షాల నుంచి మోదీ వ్యాఖ్యలపై గట్టిగానే నిరసన వెలువడుతోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా మోదీ వ్యాఖ్యలపై స్పందించారు.

విద్య, వైద్యంపై చేసే ఖర్చు ఎంతమాత్రం ‘ఉచితాలు’ కావని సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. పేదలకు మేలు చేసేందుకే ఈ పథకాలని పేర్కొన్నారు. ఇంతకుమించి మాట్లాడితే రాజకీయం అవుతుందని పేర్కొన్నారు.

ఉచిత పథకాలు దేశానికి ఏమాత్రం మంచిది కాదంటూ ప్రధాని మోదీ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై సుప్రీంకోర్టు సైతం ఆందోళన వ్యక్తంచేసింది. అయితే, ఉచితాలకు, సంక్షేమ పథకాలకు తేడా ఉందని పేర్కొంది.

‘‘విద్య, వైద్యంపై చేసే ఖర్చు ఏమాత్రం ఉచితాలు కావు. చదువు అనేది జ్ఞానానికి సంబంధించినది. వైద్యం అనేది ఆరోగ్య సంరక్షణకు సంబంధించింది. అందుకే ఈ రెండు రంగాల్లోనూ తగినన్ని సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం అమలు చేయాలనుకుంటోంది. ఇవి ఏమాత్రం ఉచితాలు కావు.. సంక్షేమ పథకాలు. ఈ మధ్య ఉచితాలు ఉండకూడదన్న సలహా ఇస్తూ కొంతమంది వ్యక్తులు కొత్తగా పుట్టుకొచ్చారు. ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే అది రాజకీయమే అవుతుంది. కాబట్టి నేను మాట్లాడను’’ అని స్టాలిన్‌ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news