జగన్ రెడ్డి పాలనలో ప్రజాస్వామ్య హక్కులు, భావప్రకటనా స్వేచ్ఛ వినియోగించుకునే అవకాశం లేకుండాపోయింది అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న టీడీపీ మహిళా నేతలపై సామాజిక మాధ్యమాల్లో నీచంగా పోస్టులు పెడుతున్నారు అని మండిపడ్డారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో మహిళలకు కనీస భద్రత లేకపోవడంపై ప్రశ్నించిన టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితపై సోషల్ మీడియాలో అసభ్య ప్రచారం చేయడం జగన్ రెడ్డి దిగజారుడు రాజకీయానికి పరాకాష్ట అని మండిపడ్డారు. 4 ఏళ్లల్లో ఒక్క ప్రాజెక్టు కట్టలేదు, ఒక్క ఎకరాకు సాగు నీరందించలేదు అని విమర్శించారు. అప్పర్ భద్రపై కేంద్రాన్ని ప్రశ్నించడం చేతగాని దద్దమ్మ జగన్ రెడ్డి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
“తుంగభద్ర నది కె–8 సబ్ బేసిన్‌లో కేటాయించిన నీటిలో అంతర్గతంగా సర్దుబాట్లతో బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులకు లోబడే కర్ణాటక ప్రభుత్వం అప్పర్ భద్ర ప్రాజెక్టు చేపట్టిందని కేంద్ర జలవనరుల శాఖ నివేదికను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2022లో పంపింది.
కేంద్ర జలవనరుల శాఖ ఫిబ్రవరి 15, 2022న అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి రూ.5300 కోట్లు బడ్జెట్‌లో ప్రకటించింది. కర్ణాటక ప్రభుత్వం బచావత్ ట్రిబ్యునల్‌లో కె–8 సబ్ బేసిన్‌లో కేటాయించిన ప్రాజెక్టుల ఆధునీకరణ ద్వారా ఆదా అయ్యే నీళ్ళను, పోలవరం నిర్మాణం ద్వారా ఆదా అయ్యే కృష్ణా జలాల్లో లభించే 21 టీఎంసీ నీటిలో 2.4 టీఎంసీల నీటిని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేటాయింపులు చేసి ఈ ప్రాజెక్టుకు అనుమతులు సాధించింది. కానీ జగన్ ప్రభుత్వం కరవు పీడిత రాయలసీమలో చట్టబద్ధ నీటి హక్కులున్న ప్రాజెక్టులకు సంపూర్ణంగా నీటిని వినియోగించుకోవడానికి చేపట్టాల్సిన ప్రాజెక్టుల ప్రణాళికలు రూపొందించడంలో, వాటిని కేంద్ర జలవనరుల శాఖ ముందుంచి అనుమతులు సాధించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించింది” అని వివరించారు.