తెలంగాణలో రైతు రుణమాఫీపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు రుణమాఫీపై దొర గారిది పూటకో మాట, రోజుకో వేషం అని సీఎం కేసీఆర్ పై సెటైర్లు వేశారు. నమ్మి ఓటేస్తే రుణమాఫీ పథకానికే పంగనామాలు పెట్టి, రైతులకు ఎగనామం పెట్టిన మోసగాడు కేసీఆర్ అంటూ మండిపడ్డారు. అన్నం పెట్టే రైతన్నకు ‘డీ ఫాల్టర్’ ముద్ర వేసిన పాపం కేసీఆర్ దే అన్నారు. లక్ష మాఫీకి 4 ఏళ్లుగా లక్ష మాటలు చెప్పిండే తప్ప లక్ష్యం మాత్రం నెరవేర్చలే అని షర్మిల అన్నారు. మాట మీద నిలబడే దమ్ము కేసీఆర్ కు ఉంటే, తక్షణం 31లక్షల మంది రైతులకు లక్ష లోపు రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ బూటకపు హామీని నమ్మి ఓటేసిన పాపానికి రైతన్న బ్యాంకుల దగ్గర దోషిలా నిలబడ్డాడని, నోటీసుల మీద నోటీసులు అందుకుంటున్నాడని తెలిపారు. దేశ చరిత్రలోనే అన్నం పెట్టే రైతన్నకు “డీ ఫాల్టర్” అనే ముద్ర వేసిన పాపం ద్రోహి కేసీఆర్‌కే దక్కిందన్నారు. రుణాలు చెల్లించాలని బ్యాంకర్లు రైతుల ఇండ్ల మీద పడుతున్నా.. రైతు బంధు పైసలను వడ్డీల కింద జమ చేసుకుంటున్నా.. 20 లక్షల అకౌంట్లను ఫ్రీజ్ చేసినా.. రోడ్ల మీద పడి రైతులు ఆందోళనలు చేస్తున్నాకేసీఆర్‌కు కనీసం చీమ కుట్టినట్లైనా లేదన్నారు.