అరటి పండును తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. పరిగడుపున అరటి పండును తినడం వల్ల ఆకలి వేయదని.. ఫలితంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకేసారి రెండు కంటే ఎక్కువగా అరటి పండును తింటే ఎక్కువ బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. అయితే అరటి పండును తిని తొక్క పడేయడం మనం తరచూ చూస్తునే ఉంటాం. అరటి పండుతో పాటు దాని తొక్కలో కూడా ఎన్నో పోషక గుణాలు దాగి ఉన్నాయి. కాబట్టి ఈ తొక్క అవసరం లేదంటూ పడేయకుండా.. వాటి ప్రయోజనాలేంటో తెలుసుకుందామా..
అరటి తొక్కలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. దోమలు లేదా వేరే కీటకాలు కుట్టినప్పుడు చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి. అలాంటప్పుడు అరటి తొక్కతో ఆ ప్రదేశంలో రుద్దితే నొప్పి, వాపు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అరటి తొక్కతో తరచూ రుద్దడం వల్ల చర్మం అందంగా కనిపించడంతో పాటు ముడతలు తగ్గిస్తాయి. ముఖంపై నల్లని మచ్చలు ఏర్పడినప్పుడు బనానా తొక్కను రాసుకుంటే తగ్గుతాయి. చర్మానికి సహజ మాయిశ్చరైజేషన్ క్రీమ్‌లా అరటి తొక్కను ఉపయోగిస్తారు. తలనొప్పి సమస్యతో బాధపడేవారు అరటి తొక్కను డీప్ ఫ్రిజ్‌లో పెట్టి అరగంట పాటు ఉంచిన తర్వాత నుదుటిపై పెట్టుకుంటే తల నొప్పి మటుమాయం అవుతుంది. కాలిలో ముల్లు గుచ్చుకున్నప్పుడు కూడా.. ఆ ప్రదేశంలో అరటి తొక్కను ఉంచితే ముల్లు ఈజీగా బయటకు వస్తుంది. దీంతోపాటు మటన్ ముక్కలు గట్టిగా ఉంటాయి.. వాటిని ఎంతసేపు ఉడికించినా ఉడకవు.. అలాంటప్పుడు అరటి తొక్కను వేసి ఉడికిస్తే మెత్తగా ఉడకడానికి సహాయపడుతుంది.
అరటి తొక్క లోపలి భాగంతో వెండి సామన్లను పాలిష్ చేయడం వల్ల అవి తళతళా మెరుస్తాయి. దీంతోపాటు లెదర్ షూలను కూడా అరటి తొక్కతో పాలిష్ చేసుకోవచ్చు. కొందరి దంతాలు పసుపు రంగులో కనిపిస్తుంటాయి. అలాంటప్పుడు అరటి తొక్కతో అప్పుడప్పుడూ దంతాలపై రబ్ చేయడానికి ఉపయోగించడం వల్ల అవి మెరుస్తాయి. అరటి తొక్కను గార్డెనింగ్‌లో ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనాలుంటాయి. ఆర్గానిక్ ఎరువుగా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇది మొక్కలు పెరిగేందుకు సహాయపడుతుంది. ఇందులోని పొటాషియం మొక్కలు వివిధ రకాల వ్యాధుల నుంచి పోరాడేందుకు వాటికి శక్తిని అందజేస్తుంటాయి.