ఆశ్వీయుజ బహుళ తదియనాడు చేసే నోము అట్లతద్దె లేదా అట్ల తదియ నోము. ఈ సారి ఈ నోము నవంబర్ 3 మంగళవారం వచ్చింది. ఈసారి ఈ వ్రతం మంగళవారం రావడం మరింత విశేషంగా చెప్పుకోవచ్చు.
ఈ నోము విశేషాలు .. ఆశ్వయుజ బహుళ తదియనాడు వచ్చే అట్లతద్ది స్త్రీలకూ ఎంతో శుభప్రదమైనది. పిల్లలు, పెద్దలు, అందరికీ ప్రమోదాన్ని కలిగించే పర్వదినం. ఈరోజున తెల్లవారు ఝామున మేల్కొని గౌరీదేవి పూజ చేయాలి.చంద్రదర్శనం అనంతరం శుచియై తిరిగి గౌరీపూజ చేసి, ఆమెకు పది అట్లు నైవేద్యంగా పెట్టాలి. తర్వాత ముత్తయిదువులకు అలంకారం చేసి, పది అట్లు, పది ఫలాలు వాయనంగా సమర్పించాలి.
అట్లతద్ది నోము కథ చెప్పుకొని, అక్షింతలు వేసుకోవాలి. అనంతరం భోజనం చేయాలి. పదిరకాల ఫలాలను తినడం, పదిమార్లు తాంబూలం వేసుకోవడం, పదిమార్లు ఊయల ఊగడం, ఈ పండుగలో విశేషం. గౌరీదేవికి నైవేద్యంగా అట్లు పెడతారు గనుకే ఈ పండుగకు అట్లతద్ది అనే పేరు వచ్చింది. అట్లతద్దే నోము కథ తెలుసుకుందాం.. నారదముని ప్రోద్బలంతో గౌరీదేవి శివుని పతిగా పొందగోరీ మొదటిసారిగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్త్రీలు సౌభాగ్యం కోసమై చేసుకునే వ్రతం ఇది. చంద్రారాధన ప్రధానమైన చంద్రకళల్లో కొలువై వున్న శక్తి అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని, కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని పండితులు చెప్తున్నారు.
ఈ పండుగలో అమ్మవారికి అట్లని నైవేద్యంగా పెట్టడంలో ఓ అంతరార్థం వుంది. నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహాప్రియం. అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోష పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులూ రావని నమ్మకం. ఋతుచక్రం సరిగా వుండేలా చేసి కాపాడతాడు. అందువల్ల గర్భధారణలో ఎటువంటి సమస్యలూ వుండవు. మినప పిండి, బియ్యపు పిండిని కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువుకు, బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు. గర్భదోషాలు తొలిగిపోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి. దీనినే ఉయ్యాల పండుగనీ, గోరింటాకు పండుగ అనీ అంటారు. పది మంది ముత్తైదువులకు నల్లపూసలు, లక్కకోళ్ళు, రవికెలగుడ్డ, దక్షిణ తాంబూలాలు మరియు పది అట్లు వాయనమిచ్చి, భోజనాలు పెట్టి ఆశీస్సులు తీసుకోవాలి. పదేళ్లు ఈ వ్రతాన్ని నిర్వహించి, ఉద్యాపనం చెప్పుకున్న స్త్రీలకు సంసారంలోని సర్వసుఖాలు లభిస్తాయి.
-శ్రీ