ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇటీవల గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరులో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ క్రమంలో ఎన్నికల సంఘం ఆత్మకూరులో ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయగా 28 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అయితే.. ఇప్పటికే నామినేషన్ల దాఖలుకు గడువు ముగియగా… మంగళవారం అధికారులు నామినేషన్ల పరిశీలనను చేపట్టారు. ఈ పరిశీనలో ఏకంగా 13 నామినేషన్లు చెల్లనివిగా తేల్చేసిన అధికారులు వాటిని తిరస్కరించారు.
ఫలితంగా బరిలో 16 మంది మాత్రమే ఉన్నారు. ఈ నెల 9న వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఈ గడువులోగా ఎవరైనా తమ నామినేషన్లు ఉపసంహరించుకుంటే… వారిని ఎన్నికల అధికారులు పోటీ నుంచి తప్పిస్తారు. భారీ ఓట్ల మెజారిటీతో గెలవాలన్న పట్టుదలతో ఉన్న వైసీపీ… అందుకోసం ఏడుగురు మంత్రులను రంగంలోకి దింపింది. వైసీపీ అభ్యర్థిగా గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన సంగతి విధితమే.