రాష్ట్ర బీజేపీ కార్యాలయం ముందు రేవంత్ రెడ్డి ధర్నాకు వస్తున్నాడని సమాచారం రావడంతో బీజేపీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు మోహరించారు. ఇక రేవంత్ వస్తున్న సంగతి తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాంధీ భవన్ నుండి బయలు దేరిన రేవంత్ ని ఉద్రిక్తతల నేపధ్యంలో గాంధీ భవన్ ముందే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు… రేవంత్..కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది.
పోలీసులు నుండి తప్పించుకుని మరీ బీజేపీ ఆఫీస్ వైప రేవంత్ వెళ్తుండడంతో అడ్డుకున్న పోలీసులు ఎంతకీ మాట వినక పోవడంతో ఆయన్ని అరెస్ట్ చేశారు. మరో పక్క బీజేపీ కార్యకర్తలు గాంధీ భవన్ వైపుకు దూసుకు వచ్చారు. గృహాకల్ప ముందు రోడ్డుపై బీజేపీ కార్యకర్తలు రాహుల్ కి వ్యతిరేకంగా పప్పు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రేవంత్ అరెస్ట్ అయ్యాక ఆయన్ని తీసుకు వెళ్తున్న వాహనం వెంట కూడా బీజేపీ కార్యకర్తలు పరుగులు పెట్టి టెన్షన్ పుట్టించారు. ఇక కాంగ్రెస్ కార్యకర్తలు మోడీ దిష్టి బొమ్మ దహనానికి యత్నం చేయగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆ దిష్టిబొమ్మను లాక్కున్న బీజేపీ కార్యకర్తలు దిష్టిబొమ్మను.. రేవంత్ పైకి విసిరినట్టు సమాచారం. రేవంతు ను ప్రస్తుతం గోషా మహల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.