పంజాబ్​ లో స్కూల్​ బస్సుపై దుండగుల దాడి

-

పిల్లలు ప్రయాణిస్తున్న స్కూల్‌ బస్సుపై కొందరు దుండగులు దాడి చేసిన ఘటన పంజాబ్‌లోని బర్నాలాలో చోటుచేసుకుంది. బైక్​పై పదునైన కత్తులతో వచ్చిన దుండగులు బస్సును వెంబడించారు. బస్సు డ్రైవర్​పై దాడి చేయగా స్వల్ప గాయాలయ్యాయి. అప్రమత్తమైన డ్రైవర్​ చాకచాక్యంగా వ్యవహరించాడు. బస్సును వెంటనే సమీపంలోని పోలీస్​ స్టేషన్​కు తీసుకెళ్లాడు. దీంతో పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు.

కొద్ది రోజుల క్రితం కొందరు వ్యక్తులు తనతో గొడవ పడ్డారని.. అందుకు ప్రతీకారంతోనే ఈ చర్యకు పాల్పడ్డారని బస్సు డ్రైవర్​ చెప్పాడు. బస్సును ఆపాలంటూ నిందితులు వెంటపడ్డారని.. పదునైన కత్తులతో తనపై దాడి చేశారని బాధితుడు తెలిపాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం పిల్లలను సురక్షితంగా వారి ఇళ్లకు పంపించారు.

బస్సు డ్రైవర్​ను విచారించిన పోలీసులు.. పాత కక్షలతోనే గొడవ పడినట్లు ప్రాథమికంగా గుర్తించారు. నిందితులను గుర్తించామని.. వారిలో ఒకరిని ఇప్పటికే పట్టుకున్నామని డీఎస్పీ తెలిపారు. నిందితులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news