దీపావళి పండుగను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రజలు వేడుకలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ లోని ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో శుక్రవారం రాత్రి నాలుగో దీపోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. నాలుగవ దీపోత్సవ కార్యక్రమం సందర్భంగా సరయు నది ఒడ్డున, అయోధ్యలోని ఆలయ ప్రాంగణంలో, రామ్ కి పైడి తదితర ఘాట్ ల వద్ద మట్టి ప్రమిదలను ఏర్పాటుచేసి దీపాలను వెలిగించి, దీపావళి సందర్భంగా గిన్నిస్ బుక్ రికార్డును సృష్టించారు. ఈ కార్యక్రమాన్ని నిర్ధారించడానికి గిన్నీస్ బుక్ బృందం హాజరైంది. ఈ ప్రపంచ రికార్డును సృష్టించటం ద్వారా గతేడాది అయోధ్యలో 4,10,206 నెలకొల్పిన రికార్డును తానే బద్దలు కొట్టినట్లు అయింది.
ఇక అయోధ్యలో దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రపంచ రికార్డుగా, విజయవంతంగా నిర్వహించినందుకు సిఎం అభినందించారు. ఫైజాబాద్‌లోని రామ్ మనోహర్ లోహియా అవధ్ విశ్వవిద్యాలయానికి చెందిన సుమారు 8,000 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇక అయోధ్య అధికార యంత్రాంగం, రామ్ మనోహర్ లోహియా విశ్వవిద్యాలయం విద్యార్థులు ఈ ప్రపంచ రికార్డు సృష్టించినందుకు స్వచ్ఛంద సేవకులందరినీ అభినందిస్తున్నాను అని సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.
అయితే 2018 దీపోత్సవంలో కూడా 3.1 లక్షల మట్టి దీపాలను వెలిగించిన గిన్నిస్ రికార్డును కైవసం చేసుకున్నారు. ఇక యుపిలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆదిత్యనాథ్ ప్రభుత్వం దీపావళి సందర్భంగా.. అయోధ్యలో దీపోత్సవ వేడుకలను నిర్వహించారు. తాజాగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగానికి రామ్ మనోహర్ లోహియా అవధ విశ్వవిద్యాలయానికి గిన్నిస్ బుక్ సభ్యులు అభినందనలు తెలియజేశారు. దీపోత్సవ కార్యక్రమానికి సంబంధించి దేదీప్యమానంగా వెలుగుతున్న దీప కాంతులతో కూడిన సుందర దృశ్యాలను, ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన వారిని ప్రశంసించారు గిన్నిస్ బుక్ రికార్డ్ సభ్యులు. ఇదే విషయాన్ని వారు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ద్వారా తెలియజేశారు.