ఆర్టీసీ బస్సులో ప్రసవించిన మహిళ.. సజ్జనార్‌ బంపర్‌ ఆఫర్‌..

-

ఓ నిండు గర్భిణి ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సులోనే బిడ్డకు జన్మనిచ్చింది. బస్సులో పుట్టిన ఆ పిల్లవాడికి ఆర్టీసీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. జీవితాంతం ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని నాందెడ్ జిల్లాకు చెందిన రత్నమాల అనే మహిళ ప్రసవం కోసం హాస్పిటల్‌కు వెళ్లేందుకు ఇంద్రవెళ్లి నుంచి ఆదిలాబాద్ వెళ్లే బస్సులో బయల్దేరింది. పురిటి నొప్పులు అధికం కావడంతో.. మాన్కాపూర్ వద్ద బస్సులోనే ఆమె పండంటి బాబుకు జన్మనిచ్చింది. ప్రసవం అనంతరం ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ 108కి సమాచారం అందించి.. అంబులెన్స్‌లో గుడిహత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

త‌ల్లీబిడ్డ యోగ‌క్షేమాల‌ను అడిగి తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు.. బస్సులో పుట్టిన చిన్నారికి జీవితాంతం ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ఆర్టీసీ ప్రకటనతో ఆ చిన్నారి కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. ‘ఆదిలాబాద్ జిల్లా, గుడిహత్నూర్ గ్రామం వద్ద ఈ రోజు టీఎస్ఆర్టీసీలో ప్రసవించిన తల్లిని, జన్మించిన బిడ్డని, సురక్షితంగా తరలించిన ఆర్టీసీ డ్రైవర్ ఎం.అంజన్నకు, కండక్టర్ సీహెచ్.గబ్బర్ సింగ్‌కు ప్రత్యేక అభినందనలు. ఆ బిడ్డకు భగవంతుడు నిండు నూరేళ్ళ ఆయుష్షు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాం’ అని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news