ఆయనో సీనియర్ ఎమ్మెల్యే. రెండు సార్లు విప్‌గా పనిచేశారు. మంత్రి పదవి చేపట్టాలని ఆయన చిరకాల కోరిక కానీ కాలం కలిసి రావట్లేదు.సామినేని ఉదయభాను జగ్గయ్యపేట ఎమ్మెల్యే ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో విప్‌గా ఉన్నారు. గతంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కూడా విప్‌గా బాధ్యతలు నిర్వహించారు. రాజకీయ కుటుంబానికి చెందిన ఉదయభాను 1999 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పటి వరకు ఐదుసార్లు పోటీచేసిన ఆయన మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. 2009లో గెలిచి మంత్రి అవుదామనుకున్న ఆయన ఓటమి దెబ్బకు ఇంటికి పరిమితం కావాల్సి వచ్చింది. 2014 వైసీపీ నుంచి పోటీ చేసినా గెలుపు దక్కలేదు.
2019లో విజయం వరించడంతో మంత్రి పదవిపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు ఉదయభాను. అయితే సామాజిక సమీకరణాలతోపాటు పలు అంశాలు శరాఘాతంగా మారి మళ్లీ విప్ పదవికే పరిమితమయ్యారు. వైఎస్‌కు సన్నిహితుడిగా, ఆ కుటుంబానికి విధేయుడిగా ఉన్న ఉదయభానుకి రెండున్నరేళ్ల తర్వాత మంత్రి పదవిపై కొంత వరకు అధిష్ఠానం ఆశీసులు ఉన్నాయట. ఆ సమయం కోసం ఎదురుచూస్తున్న ఆయనకు పలు ఘటనలు పదవి సంకటాలుగా కనిపించటంతో ఆందోళన చెందుతున్నారట.
కరోనా సమయంలో పెద్దఎత్తున తెలంగాణ నుంచి ఏపీ వాసులు సొంత వాహనాలపై ఏపీకి బయల్దేరగా వారిని జగ్గయ్యపేట చెక్‌పోస్టు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యే ఉదయభాను అక్కడ డీఎస్పీ తీరుపై మండిపడ్డారు. డీఎస్పీనే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారని మీడియాతో మాట్లాడారు. అయితే.. అనుమతి లేకుండా వచ్చే వారినే ఆపాలన్నది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగా తెలుసుకుని నాలుక కర్చుకున్నారు ఎమ్మెల్యే.
చెక్‌పోస్టులు దాటిస్తున్న రేషన్ బియ్యానికి సంబంధించి కొందరు అక్రమార్కులు ఎమ్మెల్యే పేరు చెప్పుకునే ప్రయత్నం చేయటంతో అది తెలుసుకున్న ఉదయభాను వారందరిని పిలిచి వార్నింగ్‌లు ఇచ్చారట. చిన్న విషయంలో కూడా తనకు నెగిటివ్ లేకుండా చూసుకుంటున్నప్పటికీ ఇటీవల దుర్గగుడి ట్రస్టు బోర్డు సభ్యురాలి కారులో అక్రమం మద్యం వ్యవహారం ఎమ్మెల్యేకు ముచ్చెమటలు పట్టించాయట. ఈ సమస్యల నుంచి బయటపడి ఈసారన్న మంత్రి పదవి చేపడతారో లేదో చూడాలి.