ఏపీలో బద్వేలు ఉపఎన్నిక పోరు ముగిసింది…అయితే బద్వేలు ఉపపోరుని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాల ఫోకస్ కేవలం…హుజూరాబాద్ ఉప ఎన్నికపైనే పెట్టారు. అక్కడ ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. కానీ బద్వేలు ఉపపోరులో ముందే టీడీపీ, జనసేనలు పోటీ నుంచి తప్పుకోవడంతో వార్ వన్‌సైడ్ అయిందనే చెప్పాలి. అయితే బీజేపీ, కాంగ్రెస్‌లు పోటీకి దిగి ఎన్నికని ఏకగ్రీవం కాకుండా చేశాయి.
దీంతో పోటీ జరిగింది…బద్వేలు ప్రజలు ఓట్లు వేయడం కూడా జరిగింది. కానీ ప్రధాన పార్టీలు పోటీలో లేకపోవడంతో పోలింగ్ 68 శాతం మాత్రమే నమోదైంది. కాకపోతే వైసీపీ వాళ్ళు బయట నియోజకవర్గాల నుంచి జనాలని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించడం వల్లే పోలింగ్ శాతం పెరిగిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే పోలింగ్ శాతం ఎలా ఉన్నా సరే బద్వేలు రిజల్ట్ మాత్రం చాలా క్లియర్‌గా ఉంది…కౌంటింగ్ సమయం కంటే ముందే బద్వేలులో వైసీపీ గెలుస్తుందని చెప్పేయొచ్చు. ఆ విషయం అందరికీ తెలుస్తోంది.
కాకపోతే ఇక్కడ బీజేపీ చాలా హడావిడి చేసింది…దీంతో బీజేపీ ఎంతవరకు ఓట్లు తెచ్చుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. పైగా టీడీపీ పోటీలో లేకపోవడంతో, ఆ పార్టీ సానుభూతి పరులని తమవైపుకు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నించింది. ఇక టీడీపీ వాళ్ళు కూడా బీజేపీకి ఫుల్ గా సహకరించారని ఎన్నిక సమయంలో అర్ధమైంది. పోలింగ్ ముందు రోజు బద్వేలు టీడీపీ నేతలు సమావేశమై బీజేపీకి ఓట్లు వేయాలని కార్యకర్తలకు చెప్పారు. దీంతో.. టీడీపీ నేతలు, కార్యకర్తలే పోలింగ్‌లో ఏజెంట్ల అవతారం ఎత్తారు.
అసలు బద్వేలులో కేవలం 10 శాతం బూలింగ్ బూతుల్లో బీజేపీ ఏజెంట్లు ఉంటే, 90 శాతం టీడీపీ ఏజెంట్లు ఉన్నారు. అంటే పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే టీడీపీ ఓట్లు కూడా పడేలా చేసుకున్న బీజేపీ… నోటా ఓట్లని దాటుతుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే 2019 ఎన్నికల్లో బద్వేలులో బీజేపీకి పడిన ఓట్లు కేవలం 735… అటు నోటాకు 2004 ఓట్లు పడ్డాయి. మరి ఈ సారి టీడీపీ సపోర్ట్ తీసుకున్న బీజేపీ… నోటాపై గెలుస్తుందో లేదో చూడాలి.