మొత్తానికి బద్వేలు ఉపఎన్నిక ఏకగ్రీవం కాదని అర్ధమైపోయింది. ప్రధాన ప్రతిపక్షం టిడిపి మొదట పోటీ చేయాలని చూసింది. అభ్యర్ధిగా ఓబుళాపురం రాజశేఖర్‌ని కూడా ప్రకటించింది. కానీ చనిపోయిన ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య భార్య సుధని వైసీపీ అభ్యర్ధిగా ప్రకటించింది. దీంతో జనసేన పోటీ చేయదని, ఉపఎన్నికని ఏకగ్రీవం చేసుకోవాలని పవన్, వైసీపీకి సూచించారు. ఇక పవన్ వెనుక చంద్రబాబు కూడా బద్వేలు ఉపఎన్నిక నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.
చనిపోయిన కుటుంబం నుంచే అభ్యర్ధి ఉండటంతో గత సంప్రదాయాలని పాటిస్తూ పోటీ నుంచి తప్పుకుంటున్నామని టిడిపి చెప్పింది. టిడిపి పైకి కారణం ఇది చెబుతున్నా సరే…ఇప్పటికే వైసీపీ చేతిలో చావుదెబ్బ తిని ఉంది. బద్వేలులో వైసీపీ గెలుపు ఖాయమని క్లియర్ గా అర్ధమవుతుంది. ఈ క్రమంలో పోటీ ఎందుకు అని టిడిపి సైడ్ అయింది. పైగా ఆర్ధిక పరంగా కూడా ఇబ్బందులు ఉండవు.
అయితే ప్రధాన పార్టీలు తప్పుకున్నా సరే జాతీయ పార్టీలైన బిజేపి, కాంగ్రెస్‌లు మాత్రం పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. అసలు ఏపీలో కాంగ్రెస్, బిజేపిల పరిస్తితి ఏంటో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఆ పార్టీలకు ఒక శాతం ఓట్లు కూడా లేవు. మరి అలాంటప్పుడు బద్వేలులో పోటీ చేసి, ప్రభుత్వ సమయాన్ని, అధికారుల సమయాన్ని వృధా చేస్తున్నట్లే కనిపిస్తున్నాయి.
అసలు బద్వేలులో కాంగ్రెస్, బిజేపిలు ఏ మాత్రం వైసీపీకి పోటీ ఇవ్వలేవు. గత ఎన్నికల్లో బద్వేలులో ఈ రెండు పార్టీలకు పడిన ఓట్లు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇక్కడ వైసీపీకి దాదాపు 95 వేల ఓట్లు పడితే, టిడిపికి 50 వేల ఓట్లు పడ్డాయి. ఇక కాంగ్రెస్‌కు కేవలం 2337 ఓట్లు పడగా, బిజేపికి 735 ఓట్లు పడ్డాయి. ఇక్కడ నోటాకు 2 వేల ఓట్లు పడ్డాయి. అంటే కాంగ్రెస్, బిజేపిల పరిస్తితి ఏంటి? బద్వేలులో ఏం సాధించబోతున్నాయో అర్ధం చేసుకోవచ్చు.